ఈర్ల సమ్మయ్యకు జాతీయ స్వర్ణనంది అవార్డు
ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునికి దక్కిన అరుదైన గౌరవం
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లిజిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యకు 2025-26 సంవత్సరానికి గాను జాతీయ స్థాయి స్వర్ణ నంది అవార్డు లభించింది. జూన్ 28, 2026 రాత్రి వేద రూరల్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, వేద ఎన్జీవో, ఎంఎఎంకె ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో కొమురవెల్లిలో నిర్వహించిన జాతీయస్థాయి స్వర్ణ నంది అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని, అవార్డును అందుకున్నారు.
సామాజిక సేవ, విద్యాభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం, యువతను ప్రోత్సహించడం, సమాజ సంక్షేమం కొరకు ఈర్ల సమ్మయ్య చేస్తున్న కృషిని, అతని విశిష్ట సేవలను గుర్తించిన నిర్వాహకులు జాతీయ స్వర్ణ నంది అవార్డు పత్రం, జ్ఞాపిక, పూలమాల, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈర్ల సమ్మయ్య గత రెండేళ్లుగా ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. పాఠశాలలో రూ. 30.25 లక్షలు మంజూరు చేయించి 3 తరగతి గదులను నిర్మించారు.
గ్రామంలో డ్రాపవుట్స్ లేకుండా చేసి, పిల్లల సంఖ్యను గణనీయంగా పెంచారు. దాతల సహకారంతో పాఠశాలకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 40 బెంచీలు తెప్పించారు. పిల్లల కోసం రూ.1లక్ష విలువైన మినరల్ వాటర్ ప్లాంట్, ఫ్రిడ్జ్, రూ. 40 వేల విలువైన వాటర్ ట్యాంక్, గ్లాస్ బోర్డ్, స్మైల్ ఫౌండేషన్, రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో రూ. 8 లక్షల విలువైన ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్ (స్మార్ట్ టీవీ), సోలార్ ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేయించారు. అతి త్వరలోనే పాఠశాలలో కంప్యూటర్లు, ఏసీలు, ఏర్పాటు చేస్తామని ఈర్ల సమ్మయ్య తెలిపారు.
పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి, పిల్లల చదువులో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. పిల్లల్ని అద్భుతంగా తయారుచేసి, 2024 నుంచి 2026 వరకు వరుసగా రెండుసార్లు జిల్లా బెస్ట్ స్కూల్ అవార్డు కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈర్ల సమ్మయ్య మహాముత్తారం మండలం నాయక్ పోడ్ కాలనీ మొదటి నియామకం కాబడినారు. అప్పుడు పాఠశాల పశువుల పాకలో నడుస్తుండేది. పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ కు ఆయన లేఖ రాసి, స్థానికుల ద్వారా అక్కడ చక్కటి పాఠశాల భవనాన్ని నిర్మింప చేశారు. అక్కడ పిల్లలకు చక్కటి విద్యను అందించారు.
శ్రీరాంపూర్ ఎస్సీ కాలనీలో 13 సంవత్సరాలు పనిచేసి, వాటిని అద్భుతంగా తయారు చేశారు. వేలాది మంది విద్యార్థులు, యువతను ప్రోత్సహిస్తూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దారు. అంతేకాక తన పాటలు, సాహిత్యం, సామాజిక సేవ ద్వారా సమాజంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ అవి అర్హులైన ప్రజలకు అందేలా చేస్తున్నారు.
ఆయన సేవలను గుర్తించిన పలు స్వచ్ఛంద సేవా సంస్థలు అనేక అవార్డులను అందజేస్తున్నారు. ఈర్ల సమ్మయ్యకు జాతీయస్థాయి స్వర్ణనంది పురస్కారం రావడం పట్ల, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, మిత్రులు శ్రేయోభిలాషులు బంధువులు విద్యార్థినీ, విద్యార్థులు గ్రామస్తులు, మండలం, జిల్లాలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సేవలను కొనియాడుతూ పలువురుఅభినందిస్తున్నారు.






