29 June, 2026 | 7:40 PM

నూతన సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే

29-06-2026 07:05 PM

మణుగూరు,(విజయక్రాంతి): మండలంలోని లంక మల్లారం గ్రామంలో గల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో రూ. 13.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన సైన్స్ ల్యాబ్‌ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక ప్రయోగశాలల ఏర్పాటు ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పరిశోధనా నైపుణ్యాలను పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు పట్టణ స్థాయి విద్యా సౌకర్యాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. సైన్స్ ల్యాబ్ అందుబాటులోకి రావడంతో విద్యార్థినులు ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని మరింత మెరుగు పరుచుకుని ఉన్నత విద్యలో రాణించే అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థినులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.