ప్రజలు సంతోషంగా జీవించాలి
- రాయపోల్ బోనాల వేడుకల్లో పాల్గొన్న మల్‌రెడ్డి రంగారెడ్డి
- గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం
ఇబ్రహీంపట్నం:ఆగష్టు9(విజయక్రాంతి) తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో జరిగిన మహంకాళీ బోనాల వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, ఎమ్మెల్యే రాకతో సందడిగా మారింది. ఈ సందర్భంగా గ్రామస్థులు మల్ రెడ్డి రంగారెడ్డికి ఘనస్వాగతం పలికారు.
బీరప్ప స్వామి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మె ల్యే, ఆశీస్సులు తీసుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. బోనాల వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
రాయపోల్ గ్రామంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కు చెందిన రూ.20లక్షల నిధులతో నిర్మించతలపెట్టిన సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హెచ్‌ఎండీఏ నిధులు రూ.50లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఇందిరమ్మ ఇల్లును, ప్రారంభించారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం అభివృద్ధికి పోటీపడేలా నిధుల కేటాయింపు చేస్తున్నట్లు మల్ రెడ్డి రంగారెడ్డి చెప్పారు.






