ఏడుపాయల్లో భక్తుల నిలువు దోపిడీ
వనదుర్గమ్మ సాక్షిగా ప్రతి వస్తువుపై అ ‘ధనం’
అమ్మ దర్శనానికి వస్తే జేబులు ఖాళీ అవుతున్నాయంటున్న భక్తులు
అదుపు చేసే నాధుడే లేడా?
పాపన్నపేట, ఆగస్టు 9 (విజయక్రాంతి): కష్టాలు తీర్చితే నిలువు దోపిడీ ఇస్తామని తమ ఇష్టదైవమైన వనదుర్గామాతను భక్తులు మొక్కుకుంటారు. వన దుర్గమ్మ క్షేత్రానికి వస్తే మిమ్మల్ని మేమే దోచుకుంటామని ప్రతిన పూనుతున్నారు వ్యాపారులు, పెద్దమనుషులు. వనదుర్గమ్మకు సమర్పించే కానుకలు, ముడుపులు ఎలా ఉన్నా అధిక ధరల పేరిట సాగుతున్న దగానే ఎక్కువగా ఉంటోంది. ఏడుపాయల వనదుర్గా మాత పుణ్యక్షేత్రంలో భక్తుల దోపిడీ యదేచ్ఛగా సాగుతున్నా అదుపు చేసే నాధుడే లేడు. దీంతో వనదుర్గా మాతను దర్శించుకుందామని వచ్చే లక్షలాది మంది భక్తులు తీవ్రంగా నష్టపోతున్నారు.
భక్తుడే సర్వస్వం..
దేవుడు ఉన్నది భక్తుడి కోసమే.. భక్తుడు సైతం దేవస్థానానికి వచ్చేది దేవుడి కోసమే. భక్తుడికి దేవుడికి మధ్య అనుబంధాన్ని పెంచేలా సౌకర్యాలు కల్పించాల్సిన దేవస్థానం అందుకు విరుద్ధంగా ఆదాయమే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. భక్తుడు దోపిడీకి గురవుతున్నాడని తెలిసినా యంత్రాంగం పట్టించుకోకపోవడం విడ్డూరం.
దోచుకుంటున్నారు : నాగరాజు, భక్తుడు, సంగారెడ్డి
రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గామాతను వీలున్నప్పుడల్లా కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకుంటాం. క్షేత్రంలోకి ప్రవేశించిన వెంటనే దోపిడీ ప్రారంభమవుతోంది. వివిధ టెండరు వ్యాపార నిర్వాహకులు కట్నాల పేరిట డిమాండ్ చేస్తూ భక్తుడు నుంచి వసూలు చేస్తున్నారు. ఆయా మొక్కులకు సంబంధించిన రసీదులను దేవాలయం నుంచి తీసుకున్నా సరే.. కట్నం ఇవ్వాల్సిందేనని నిర్వాహకులు డిమాండ్ చేస్తూ వసూలు చేస్తున్నారు. ఆలయం చెంతన ఉన్న ఓ దుకాణంలో లీటరు నీళ్ల సీసా తీసుకుంటే రూ.20కు బదులుగా రూ.30 తీసుకుంటున్నారు. ఇలా ప్రతి వస్తువుపై దాని విలువను బట్టి అదనంగా దండుకుంటున్నారు. చేసేదేమీ లేక వారు అడిగినంత ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం : రామకృష్ణారావు, ఆర్ జే సీ
భక్తులను అధిక ధరలతో దోపిడీకి గురి చేస్తే ఉపేక్షించేది లేదు. భక్తులు సైతం ప్రశ్నించాలి. మొక్కుబడులకు ఆలయం ఇచ్చే రసీదు తీసుకున్న తరువాత ఆయా టెండరు వ్యాపార నిర్వాహకులకు ఎలాంటి కట్నాలు ఇవ్వొద్దు. దుకాణాలు, వ్యాపారాల నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేస్తాం. ఆదాయం కంటే భక్తుడి సౌకర్యమే ముఖ్యం.






