19 June, 2026 | 4:28 AM

వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

19-06-2026 01:51 AM

పారిశుధ్య పనులు పర్యవేక్షించిన చేవెళ్ల కమిషనర్ యాదగిరి

చేవెళ్ల జూన్ 18 (విజయక్రాంతి): చేవెళ్ళ పురపాలక పరిధిలో ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా పారిశుధ్య నిర్వహణను మరింత ముమ్మరం చేసినట్లు కమీషనర్ తెలిపారు. గురువారం ఉదయాన ఆయన పట్టణంలోని వివిధ వార్డులలో స్వయంగా పర్యటించారు. పారిశుధ్య పనులు, రోడ్ల క్లీనింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సిబ్బందికి పనుల నిర్వహణపై దిశానిర్దేశం చేస్తూ, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమించాలని ఆదేశించారు. వర్షాకాల నేపథ్యంలో ప్రజలకు మున్సిపల్ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. డ్రైనేజీలు, మురుగు కాలువలు సాఫీగా సాగేలా పూడికతీత పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పురపాలిక సంఘం పరిధిలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడమైదన్నారు.

ప్రజలు, వ్యాపారస్తులు ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పర్యావరణహితమైన గుడ్డ సంచులను వాడాలని, ప్లాస్టిక్ వ్యర్థాలను పారేయవద్దన్నారు. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఇళ్ల పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకునేల జాగ్రత్త వహించాలని చెప్పారు. తాగునీటిని వృథా చేస్తూ మోరీల్లో (మురుగు కాలువల్లో) పారబోయరాదని, నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. కలుషిత నీటి వల్ల డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు సోకే ప్రమాదముందన్నారు. కార్యక్రమాల్లో మున్సిపల్ అధికారులు, వార్డు అధికారులు పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.