1 March, 2026 | 3:12 AM

2౦ మంది సజీవ దహనం

01-03-2026 01:21 AM

పటాకుల కేంద్రంలో భారీ పేలుడు.. భీతిల్లిన వేట్లపాలెం

కాకినాడ జిల్లా సూర్యశ్రీ ఫైర్వరక్స్ కేంద్రంలో దుర్ఘటన

పేలుడు ధాటికి పొలాల్లో కిలోమీటరు మేర ఎగిరిపడ్డ మృతదేహాలు

  1. మరో తొమ్మిది మందికి తీవ్ర, నలుగురికి స్వల్ప గాయాలు
  2. ప్రమాద సమయంలో పరిశ్రమంలో 34మంది కూలీలు
  3. ఇప్పటి వరకు 11మంది మృతదేహాలు గుర్తింపు
  4. ఐదు కిలోమీటర్ల మేర వినిపించిన భారీ శబ్దం

తీవ్రతకు పక్క గ్రామంలోని స్కూల్ స్లాబ్‌కు పగుళ్లు 

కాకినాడ, విజయక్రాంతి : ఆంధ్రప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపా లెం పటాకుల తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మండలంలోని వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వరక్స్ కేంద్రంలో శనివారం మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో 2౦ మంది ప్రా ణాలు కోల్పోయారు. మరో 9మంది తీవ్ర, నలుగురు స్వల్పంగా గాయపడ్డారు.

మృతదేహాలు తునాతునకలై గాల్లోకి ఎగిరి, పక్కనే ఉన్న పొలాల్లో కిలోమీటర్ దూరంలో పడ్డా యి. చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర భాగా లు చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యా రు. పేలుడు శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల వరకు వినిపించిందని, దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయని స్థానికులు తెలిపారు.  ప్రమాద సమయంలో అక్కడ 34 మంది కార్మికులు ఉన్నట్లు తెలిసింది. శబ్దం తీవ్రతకు పక్క గ్రామంలో ఉన్న ప్రైవేటు పా ఠశాలలో స్లాబు పగుళ్లు వచ్చాయి. వేట్లపా లెం గ్రామ ఇళ్లకు సైతం పగుళ్లు వచ్చాయని స్థానికులు తెలిపారు.

పేలుడు ఘటనపై సీఎం దిగ్భ్రాంతి   

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం, జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న  పటాకుల తయారీ కేంద్రంలో సం భవించిన భారీ పేలుడు ఘటనపై ముఖ్య మంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదంలో  21మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహా యం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతకుముందే   రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను అప్రమత్తం చేశారు.  

మృతుల కుటుంబాలకు మాజీ సీఎం జగన్ సానుభూతి

కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటనలో పలువురు ప్రాణాలు కో ల్పోవడం పట్ల  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ప్రమా దంలో కార్మికులు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఇటువంటి విషాద సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే, ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పేలుడు ధాటికి గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్య సహాయం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.

దుర్ఘటన కలచివేసింది: మంత్రి నారా లోకేశ్

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పెదపూడి రోడ్డులో జరిగిన పటాకుల తయారీ కేంద్రం పేలుడు ఘటనపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది మాటలకు అందని విషాదమని, ఊ హించని ఈ ప్రమాదంలో పలువురు మృ త్యువాత పడటం తనను ఎంతగానో కలచివేసిందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతులకు నివాళులు అర్పించిన ఆయన.. వారి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

11మంది మృతుల గుర్తిపు

ప్రమాదంలో మరణించిన వా రి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారాయి. శరీర భాగాలు చెల్లాచెదురుగా దూరంగా పడడంతో మృతుల వివరాలు తెలుసుకోవడం అధికారులకు కష్టంగా మారింది. సాయంత్రం వరకు 11మంది మృతులను అధికారులు గుర్తించారు. వారిలో అడ బాల శ్రీను, మందపల్లి చిన్ని, కడింపల్లి కృపమ్మ, సాధనాల సత్యవేణి, కడింపల్లి ధనరాజు, నిమ్మాడ కరుణ, వట్లూరి రవి, గొడతా నాని, గంపల మంగ, గొడతా రాము, గొడతా మ హేశ్ ఉన్నారు. 

మృతుల సంఖ్య పెరిగే అవకాశం

సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. తీవ్రంగా గాయపడిన 9మందిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.  అయితే, ఈ ప్రమాదం తీవ్రంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరిమితికి మించి పటాకుల తయారుచేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పోలీసులు, ఇతర అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

పటాకుల తయారీలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగు తున్నాయని, అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద వార్త తెలుసుకున్న కార్మికుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. తమ వారి ఆచూకీ కోసం వెదుకులాడుకోవడం కనిపించింది. ఈ భారీ పేలుడుతో వేట్లపాలెం గ్రామం భీతిల్లిపోగా.. ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.