1 March, 2026 | 5:04 AM

ఆ ఏడుగురు మావోయిస్టులు ఎక్కడ?

01-03-2026 01:06 AM

అడవుల్లోనే ఉన్నారా?

ఎన్‌కౌంటర్‌లో చనిపోయారా!

కేంద్రం అమలు చేసిన ఆపరేషన్ కగార్‌తో దేశంలో మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. పలువురు కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోగా, మరికొందరు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖ నాయకులు ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో మల్లా రాజిరెడ్డి (దేవ్‌జీ), బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.

అయితే తెలంగాణకు చెందిన కొందరు మావోయిస్టుల ఆచూకీ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన రంగబోయిన భాగ్య అలియాస్ రూపి ఉత్తర బస్తర్ ప్రాంతంలో ఏరియా కమాండర్‌గా ఉన్నట్లు సమాచారం. అక్కన్నపేటకు చెందిన కాశబోయిన స్వరూప  25 ఏళ్ల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లింది. నంగునూరు ప్రాంతానికి చెందిన రంగు అరుణ అలియాస్ పద్మక్క  దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీలో సభ్యురాలిగా పనిచేసినట్లు సమాచారం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ 28 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంతవరకు అచూకీ లేదు. తల్లిదండ్రులు చనిపోయినా కడసారి చూపునకు రాలేదు. ఇదే జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన బండి చంద్రం అలియాస్ మహేష్ 28 ఏళ్ల క్రితం వెళ్లిపోయారు. ఇంతవరకు అచూకీ లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చందుర్తి మండల కేంద్రానికి చెందిన బత్తుల కాంతారావు అలియాస్ నవీన్ 30 ఏళ్ల క్రితం మావోయిస్టు పార్టీలోకి వెళ్లిపోయారు.

దండకారణ్యం నుంచి ఆంధ్ర, ఒడిశా సరిహద్దుకు బదిలీపై వెళ్లారు. ఇంతవరకు వందల సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్లు జరిగినా వీరి అచూకీ తెలియడం లేదు. కుటుంబ సభ్యులు వారిని స్మరించుకుంటూ కన్నీరు పెడుతున్నారు. అలాగే మావోయిస్టు, జనశక్తి పార్టీలు పురుడు పోసుకున్న వేళల్లో ఎంతోమంది యువకులు అదృశ్యమయ్యారు. వారి జాడ తెలియడం లేదు. అలాంటి వారిలో దగ్గు రాజలింగం కూడా ఉన్నారు. 

మెదక్ జిల్లా ప్రస్థానం ముగిసిందా?

నాటి పీపుల్స్ వార్, జనశక్తి దళాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన అనేక మంది కీలక నేతలు ఉన్నారు. కాలక్రమేణా వారిలో కొందరు ఎన్‌కౌంటర్లలో మరణించగా, మరికొందరు లొంగిపోయారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి సుమారు 11 మంది మాత్రమే మావోయిస్టు పార్టీలో ఉన్నారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

జైళ్లలో ఉన్న కేసులు

ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జైళ్లలో వందల సంఖ్యలో మావోయిస్టు కేసులతో వ్యక్తులు నిర్బంధంలో ఉన్నారు. కొందరు విచారణ ఖైదీలుగా సంవత్సరాలుగా జైల్లోనే ఉన్నారు. కేంద్ర హోం శాఖ పునరావాస విధానాలపై దృష్టి సారించినట్లు సమాచారం.

సిద్ధాంత సంక్షోభం

మాజీ మావోయిస్టు సిద్ధాంతకర్త మల్లోజుల వేణుగోపాల్ (సోను దాదా) వ్యాఖ్యల ప్రకారం, సిద్ధాంతపరమైన పొరపాట్లు, వ్యూహపరమైన తప్పిదాలు పార్టీ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయేలా చేశాయి. దేశంలో కమ్యూనిజం శతాబ్ద కాల ప్రయాణం చేసినప్పటికీ, నేటి వామపక్షాలు సంక్షోభంలో ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

భవిష్యత్తుపై ప్రశ్నలు

మావోయిస్టు ఉద్యమం పూర్తిగా ముగిసిందా? లేక కొత్త రూపంలో మళ్లీ పుట్టుకొస్తుందా? పీడిత వర్గాలు ఉన్నంతవరకు ప్రతిఘటన రూపాలు మారుతాయే గానీ అంతరించవని కొందరి అభిప్రాయం. ప్రస్తుతం ఉద్యమం సంక్షోభ దశలో ఉన్నప్పటికీ, దాని ప్రభావం, దాని చరిత్ర, దాని మిగిలిన ప్రశ్నలు ఇంకా సమాధానాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. 

దామరపల్లి నర్సింహారెడ్డి రచయిత కవి