పెద్దపల్లి పోయే గోస తప్పే!
కేసముద్రం మార్కెట్లోనే మక్కల నిల్వ
మార్క్ఫెడ్ కొనుగోళ్లకు మార్గం సుగమం
కొనుగోళ్ళు వేగవంతమవుతాయని రైతుల హర్షం
కేసముద్రం, మే 10 (విజయక్రాంతి): మార్క్ఫెడ్ సంస్థ ద్వారా మక్కల కొనుగోళ్లకు కొంత మార్గం సుగమమయ్యింది. మహబూబాబాద్ జిల్లాలో కొనుగోలు చేసిన మక్కలను పెద్దపల్లికి తరలించి అక్కడ గోదాముల్లో నిలువ చేసే పరిస్థితి ఉండేది. దీనితో లారీల కొరత, దిగుమతి సమయంలో ఇబ్బందులు తలెత్తడం వల్ల జిల్లావ్యాప్తంగా మక్కల కొనుగోళ్లకు తీవ్ర ఆటంకంగా మారింది. దీనితో రోజుల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షించడం, వాతావరణంలో మార్పుల వల్ల అకాల వర్షాల వల్ల నష్టపోయే పరిస్థితి తలెత్తడంతో, జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆధునిక డీ ఈ బీ షెడ్లలో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మక్కలను నిలువ చేయడానికి ప్రత్యేకంగా మార్క్ఫెడ్ సంస్థ ద్వారా అనుమతి ఇప్పించారు. మూడు రోజులుగా మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ, మార్కెటింగ్, పోలీస్ యంత్రాంగం హమాలీలతో చర్చలు జరిపి డీ ఈ బీ షెడ్లలో నిల్వ చేయడానికి కూలి రేట్లు ఖరారు చేశారు. దీనితో శనివారం సాయంత్రం నుండి పెద్దపల్లికి పంపకుండా కేసముద్రం మార్కెట్లోనే మక్కలను నిలువచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
దాదాపు మూడు లక్షల బస్తాల మొక్కజొన్నలు మార్కెట్లో ఉన్న మూడు డీ ఈ బీ షెడ్లలో నిలువ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక షెడ్లో లక్ష బస్తాల వరకు నిల్వ చేయడానికి కాంట్రాక్టర్ ను నియమించారు. బస్తాలను నిల్వ చేయడం, వాటి రక్షణ బాధ్యత పూర్తిగా కాంట్రాక్టర్ కు అప్పగించారు. ఇప్పటి వరకు ఇక్కడ నుంచి 1.53 లక్షల బస్తాలా మక్కలను పెద్దపల్లికి తరలించగా, ఇక నుంచి ఈ ప్రాంతంలో కొనుగోలు చేయడానికి నిర్ణయించిన మక్కలను పూర్తిగా ఇక్కడే నిలువ చేస్తారు. ఇక్కడి పరిస్థితి సమీక్షించి జిల్లాలోని మిగతా చోట్ల ఖాళీగా ఉన్న గోదాముల్లో మక్కలు నిల్వచేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇక కొనుగోళ్లు వేగవంతం
కేసముద్రం మార్కెట్ పరిధిలో మక్కల కొనుగోళ్లు ఇక వేగం పుంజుకోనున్నాయి. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షిస్తున్న రైతులు తాము పండించిన మక్కలను మార్క్ఫెడ్ సంస్థ నిర్దేశించిన నిబంధనల ప్రకారం 14 శాతం తేమ ఉండేవిధంగా బాగా ఆరబెట్టి, శుభ్రం చేసి గన్ని సంచుల్లో 51 కిలోల చొప్పున తూకం వేసి, వ్యవసాయ శాఖ ఆన్లైన్ డేటా నమోదు ప్రకారం, నేరుగా మార్కెట్ కు తీసుకువచ్చి మార్క్ఫెడ్ నిలువ గోదాము కు చేర్చే విధంగా ఏర్పాటు చేశారు.
ఫలితంగా కేసముద్రం, ఇనుగుర్తి మండలాల పరిధిలోని మార్క్ఫెడ్ మక్కల కొనుగోళ్లలో ఇక జాప్యం లేకుండా కొనుగోళ్లు పూర్తిచేసే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆదివారం సెలవైనప్పటికీ కేసముద్రం మండల పరిధిలో ఇప్పటికే కొనుగోలు చేసిన మక్కలను పెద్దపల్లికి కాకుండా ట్రాక్టర్ల ద్వారా కేసముద్రం మార్కెట్ షెడ్ కు తరలించి నెట్టు వేయిస్తున్నారు. ఈ పని వేగవంతంగా నడుస్తుండడంతో రైతులు మక్కల కొనుగోలు పూర్తి చేసి ఇంటి ముఖం పడుతున్నారు.






