11 May, 2026 | 4:53 AM

2029లో ఎగిరేది బీసీల జెండానే

11-05-2026 03:36 AM
  1. టీఆర్పీ అధ్యక్షుడు,- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
  2. జనగామాలో పలు పార్టీల నుంచి టీఆర్పీలో చేరికలు

హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): జనగామాలో ఆదివారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ సమావేశం నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆ పార్టీలకు రాజీ నామా చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. 2029లో రాజ్యాధికారం బీసీలదే అని, ఎగిరేది బీసీల జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. లక్ష మంది లేని వెలమలు, పది లక్షల మంది లేని రెడ్లు ముఖ్యమంత్రులు అవుతామంటుంటే, రెండు కోట్లకు పైగా ఉన్న బీసీ, ముస్లిం బిడ్డలు ఏమైపోవాలని ఆయన ప్రశ్నించారు. తమిళనాడులో విజయ్ మీడియా మద్ద తు లేకుండా యువత,

మహిళల అండతో ఎలా విజయం సాధించారో, అదే స్ఫూర్తితో 2029 నాటికి తెలంగాణ గడ్డ మీద బీసీల జెం డా పాతుతామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలు బీసీల ఎన్నికలు అని, కత్తెర గుర్తుతో ఆత్మగౌరవాన్ని పైకెత్తాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా నాయకత్వాన్ని పటిష్టం చేసిన సదానందం, మౌనికలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జనగామలో ఇల్లు లేని పేదలకు స్థలం లేదనే నాయకులు, 15 ఎకరాల ఖానామెట్ భూమిని (ఎకరం వంద కోట్ల విలువ చేసే సుమారు 1500 కోట్ల భూమి) ఒక ప్రైవేట్ (సింధు) ఆసుపత్రి కోసం కేసీఆర్ కేవలం లక్షన్నర రూపాయలకే కట్టబెట్టారని మండిపడ్డారు. 

దొంగల ముఠా అంతా ఒకటే

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ భూమిని గుం జుకుంటామని చెప్పిన రేవంత్‌రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఆ లీజును 60 ఏళ్ల నుంచి 68 ఏళ్లకు పెంచారని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ భూమిని ఇస్తే, కాంగ్రెస్ జీవో ఇస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చి రిబ్బన్ కట్ చేశారని, ఈ దొంగల ముఠా అంతా ఒకటేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో భూమి లేని 75 లక్షల కుటుంబాలకు భూమిని పంచి ఇవ్వడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు.

చట్టసభలకు ముస్లిం మహిళలు, జనరల్ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఒక్క ముస్లిం మహిళ కూడా అసెంబ్లీకి వెళ్లలేదని, తమ పార్టీ తరపున ముస్లిం మహిళలను కచ్చితంగా చట్టసభలకు పంపుతామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే, ఎస్సీ, ఎస్టీలకు కేవలం రిజర్వడ్ స్థానాలే కాకుండా భవిష్యత్తులో పెరిగే జనరల్ స్థానాల్లో కూడా నిలబెట్టి వారి కోటాలు పెంచుతామని  ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కిషన్ రెడ్డి, అమిత్ షా తదితర బీజేపీ నేతల పిల్లలు విదేశాల్లో చదువుకుంటూ, వ్యాపారాలు, అంతర్జాతీయ క్రికెట్ బోర్డుల్లో స్థిరపడితే.. మన పేద పిల్లల చేతుల్లో మాత్రం కాషాయ జెండాలు పెట్టి వారిని బలిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మన పార్టీ కాదని, సర్దార్ సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యల వారసత్వంతో ఏర్పడిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మనదని గుర్తుచేశారు.