4 July, 2026 | 9:29 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

‘సర్’పై పార్టీల సన్నద్ధత

30-06-2026 12:00 AM

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై దేశవ్యాప్తంగా అనేక అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీహార్, పశ్చిమ బంగాల్ రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓట్లు తొలగించారన్న ప్రతిపక్ష పార్టీల ఆరోపణలతో సర్ ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో ని అధికార పార్టీకి లబ్ధి చేకూరేలా తమ సానుభూతిపరుల ఓట్లను తొలగించారని ఆయా రాష్ట్రాల్లోని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేయడంతో ఇది రాజకీ యంగా సున్నితమైన అంశంగా మారింది.

ఈ ఆరోపణలు, అనుమానాలు, వివాదాల మధ్యనే ఇటీవల తెలంగాణలోనూ సర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ వివాదాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు దీనిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాయి. నిర్లక్ష్యం వహిస్తే తమకు తీవ్ర నష్టం జరుగుతుందనే అనుమానంతో ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ముందస్తు చర్యలకు ఉపక్రమించాయి. తమ పార్టీల సానుభూతిపరులు, మద్దతుదారుల పేర్లు ఓటర్ల జాబితా నుంచి గల్లంతు కాకుండా చూసుకునేందుకు విపక్షాలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాయి.

బూత్‌లవారీగా కార్యకర్తలకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉందో, లేదో పరిశీలించాలని ఆదేశించాయి. ఒకవేళ ఎవరిదైనా పేరు లేకపోతే వెంటనే అభ్యంతరం వ్యక్తం చేయాలని, మళ్లీ పేరు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించాయి. ఆయా పార్టీల ప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించడం, దరఖాస్తులు నింపించడం, అధికారులకు సమర్పించడం వంటి బాధ్యతల్లో ఇప్పటికే తలమునకలయ్యారు.

ఏ ఒక్క అర్హుడి పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ఈ సన్నద్ధత వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా, అదే సమయంలో ఓటర్ల జాబితాలో పేరు లేని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని బంగాల్, అసోం వంటి రాష్ట్రాల పాలకులు ప్రకటించిన నేపథ్యంలో దీనిపై ఆందోళనలు మిన్నంటాయి. దీంతో ఓటర్ల జాబితాలో పేరు ఉండటం కేవలం ఓటుహక్కుగానే కాకుండా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలపరంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.

దీనివల్ల అంతిమంగా ఏ రాజకీయ పక్షానికి లబ్ధి చేకూరుతుందనేది ఇప్పుడే చెప్పలేం. కానీ నకిలీ, డూప్లికేట్ ఓట్లను తొలగించి ఓటరు జాబితాను ప్రక్షాళన చేయాలన్న ఎన్నికల కమిషన్ లక్ష్యం నెరవేరాలంటే పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఈ ప్రక్రియ చేపట్టాలని మాత్రం చెప్పక తప్పదు. అప్పుడే ఎన్నికలపై ప్రజల విశ్వాసం మరింత బలపడుతుంది.