పాకిస్థాన్ కుట్ర?
- నోయిడా హింసకు ముందుగానే ప్లాన్?
- పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు
- 350మంది అరెస్టు, 100 మంది విచారణ
లక్నో, ఏప్రిల్ 14: నోయిడా కార్మికుల సమ్మె హింసాత్మకంగా మారడం వెనుక పాక్ పక్కా వ్యూహం ఉందని, రాష్ట్రంలో అస్థిరత సృష్టించేందుకు ముందుగానే పెద్ద కుట్ర జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల నలుగురు ఉగ్రవాదులు పట్టుబడటం, వీరికి పాక్‌కు చెందిన హ్యాండర్లతో సంబంధాలున్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తుంది. దేశ వ్యతిరేక శక్తులు ఈ కార్మికుల సమ్మెవెనుక ఉన్నాయనే అనుమానాలున్నాయి.
ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌లలో కార్మికులను రెచ్చగొట్టే ప్రకటనలు, సందేశాలు పంపడం వెనుక విద్రోహుల హస్తం ఉందనేదానిపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడైనట్లు తెలుస్తుంది. సోమవారంనాటి ఆందోళన హింసాత్మక వెనుక ఉన్న 350 మందిని పోలీసులు అరెస్టు చేయగా, అందులో వందమందిని విచారిస్తున్నారు.
మరోవైపు మంగళవారం కూడా నోయిడాలోని గౌతమ్ బుద్ధనగర్‌లో కార్మికులు వీధుల్లోకి వచ్చారు. పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నించడంతో ఘర్షణలు చెలరేగాయి. రెండు, మూడు చోట్ల గుంపులు పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వాయి. ఆ ప్రాంతంలో 15 కంపెనీల పారామిలిటరీ బలగాలు, 26 మంది అధికారులను మోహరించారు.
నాలుగు డిమాండ్లకు అంగీకారం..
యూపీ కార్మికశాఖ మంత్రి అనిల్ రాజ్‌భర్ ఆందోళనపై పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు. నోయిడా, మీరట్ ప్రాంతాల్లో ఇటీవలే నలుగురు ఉగ్రవాదులు పట్టుబడ్డారని, వీరికి పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు తేలిందని చెప్పారు.
కార్మికులు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు. ఐదు డిమాండ్లలో నాలుగింటిని ప్రభుత్వం అంగీకరించిందన్నారు. కార్మికుల కనీస వేతనాలను 3వేలు పెంచామన్నారు. నైపుణ్యం లేని కార్మికుల నెలవారీ వేతనాలు రూ. 11,313 నుంచి రూ. 13,690కి పెంచామని, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి అనిల్ ప్రకటించారు.






