15 April, 2026 | 4:35 AM

సీఎం పదవికి నితీష్ రాజీనామా

15-04-2026 12:28 AM

నూతన ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని ప్రకటన

పాట్నా, ఏప్రిల్ 14: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా సమర్పించారు. మంగళవారం ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, మంత్రి విజయ్ చౌదరిలతో కలిసి లోక్‌భవన్ చేరుకొని గవర్నర్ సయ్యద్ అతా హుస్సేన్‌కు రాజీనామా సమర్పించారు. ఇటు ఆయన రాజీనామా ప్రకటన వెలువడగానే నూతన సీఎంగా బీజేపీ సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసింది. నితీష్ కుమార్ రాజీనామా సమర్పణకు ముందు బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్‌తో సహా పార్టీ సీనియర్ నాయకులను కలిశారు. కేబినెట్ చివరి సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ రద్దు విషయాన్ని సహచరులకు తెలిపారు.

రాజీనామా అనంతరం నితీష్ కుమార్ తన ఎక్స్ పోస్ట్‌లో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా రెండు దశాబ్దాలు కొనసాగిన నితీశ్ కుమార్ ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2005 నవంబర్ 24న రాష్ట్రంలో తొలిసారిగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. అప్పటినుంచి చట్టబద్ధమైన పాలన కొనసాగుతుంది. ఆది నుంచి అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేశాం. హిందువులు, ముస్లింలు, అగ్రవర్ణాలు, వెనుకబడినవారు, అత్యంత వెనుకబడినవారు, దళితులు అందరి కోసం పనులు జరిగాయి.

విద్య, ఆరోగ్యం, రోడ్లు, విద్యుత్, వ్యవసాయం ఇలా ప్రతి రంగంలోనూ పనులు జరిగాయి. బిహార్ అభివృద్ధి చెందింది. రాబోయే రోజుల్లో గణనీయమైన పురోగతి సాధిస్తుందని ఆశిస్తున్నాను. బీహార్ అభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ అందించిన మద్దతుకు ధన్యవాదాలు. కొత్త ప్రభుత్వానికి తన మద్దతు, మార్గదర్శకత్వం ఉంటుంది. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అని నితీష్ కుమార్ పేర్కొన్నారు.