29 June, 2026 | 3:02 PM

Breaking News

విద్యుత్ సమస్యలపై జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం

29-06-2026 01:52 PM

ఎల్లారెడ్డి పేట జూన్ 29 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ, లీగల్ ప్రొటెక్షన్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి మారుపాక హరీష్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని ప్రమాదకరంగా ఉన్న 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు, నివాసాలపై నుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్ తీగలు, తొలగించాల్సిన విద్యుత్ స్తంభాలు, పాత ఐరన్ డీపీ స్థానంలో కాంక్రీట్ డీపీ ఏర్పాటు వంటి సమస్యలపై ఇప్పటికే ఏఈ, ఏడీఈ అధికారులకు, అలాగే ఎన్‌పీడీసీఎల్ ఎండీ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా దాదాపు రెండు నెలలుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని హరీష్ ఆరోపించారు.

ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్య వైఖరిని వీడి గ్రామ ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు.ఈ కార్యక్రమంలో లీగల్ ప్రొటెక్షన్ హ్యూమన్ రైట్స్ జిల్లా డైరెక్టర్ సుధామల్ల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ నవీన్, బీఆర్ అంబేద్కర్ యువజన సంఘం యూత్ ప్రెసిడెంట్ గడ్డమీది సాయిచంద్, చీఫ్ సెక్రటరీ మిడిదొడ్డి అనిల్, యువ నాయకులు అందే ఈశ్వర్, నమిలికొండ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.