21 April, 2026 | 1:11 AM

వరి గడ్డీ.. బంగారమే!?

21-04-2026 12:00 AM
  1. కాలుష్యం నుంచి కాసుల వైపు..
  2. ‘బయో ఇంధన రంగంలో నవ శకం
  3. ‘సిద్దిపేటలో రూ. 700 కోట్లతో భారీ బయో గ్యాస్ ప్లాంట్

నంగునూరు, ఏప్రిల్ 20(విజయక్రాంతి): తెలంగాణలో వ్యవసాయ వ్యర్థాల వినియోగంలో సరికొత్త విప్లవం మొదలైంది.ఒకప్పుడు పొలాల్లో తగులబెట్టి కాలుష్యానికి కారణమయ్యే వరిగడ్డి, ఇప్పుడు రైతులకు అదనపు సిరులు కురిపించే నల్ల బంగారం గా మారుతోంది. భారతదేశపు స్వచ్ఛ ఇంధన స్వప్నాన్ని సాకారం చేసే దిశగా, సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట పారిశ్రామిక ప్రాంతంలో జూనో జుల్  బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన ప్రతిష్టాత్మక కాంప్రెస్డ్ బయోగ్యాస్ (సిబిజి) ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.

ఈ ప్రాజెక్టును మొత్తం 10 ప్లాంట్ల కలయికతో ఒక భారీ క్లస్టర్ గా రూపొందిస్తున్నారు.మొత్తం రూ. 700 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్లాంట్ ద్వారా రోజుకు 100 టన్నుల(టీపిడి) బయోగ్యాస్ ఉత్పత్తి చేయనుంది.ఏప్రిల్ 12 న జరిగిన శంకుస్థాపన తో మొదటి దశ పనులు ప్రారంభమయ్యాయి.రూ.210 కోట్లతో 30 టీపీడీ సామర్థ్యం కలిగిన ప్లాంట్లను పది నెలల్లో పూర్తిచేయాలని సంస్థ లక్ష్యం పెట్టుకుంది.2029-30 నాటికి మొత్తం 10 ప్లాంట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

వ్యర్థాల నుండి సిరుల వేట..సర్క్యులర్ ఎకానమీ

సాధారణంగా వరి పంట తర్వాత మిగిలే గడ్డిని తగలబెట్టడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా జూనో జుల్ సంస్థ వరిగడ్డి తో పాటు కోళ్ల వ్యర్థాలు, పశువుల పేడ వంటి సేంద్రియ వ్యర్థాలను సేకరించి వాటిని స్వచ్ఛమైన ఇంధనంగా మారుస్తుంది. రైతుల నుంచి నేరుగా గడ్డిని కొనుగోలు చేయడం ద్వారా వారికి అదనపు ఆదాయం లభించడమే కాకుండా,వ్యర్థాల నుంచి విలువైన శక్తిని సృష్టించే సర్క్యులర్ ఎకానమీ ఇక్కడ వృద్ధి చెందుతుంది.ఈ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్, గోబర్ధన్ ,సతత్ పథకాల లక్ష్యాలకు అనుగుణంగా సాగుతోంది. 

ముందస్తు ఒప్పందాలు, ఉపాధి అవకాశాలు

ఈ ప్రాజెక్టుకు మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా ఇప్పటికే గెయిల్, భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీయల్) సంస్థలతో ముందస్తు కొనుగోలు ఒప్పందాలు పూర్తయ్యాయి. ఇక్కడ తయారయ్యే గ్యాస్ హైదరాబాద్ లోని పరిశ్రమలు,వాహనాల అవసరాలకు సరఫరా చేయబడుతుంది. ఈ ప్లాంట్ ద్వారా వందలాది మంది స్థానికులకు ప్రత్యక్షంగా,పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఇప్పటికే సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రికార్డు స్థాయిలో పురోగతి సాధించగా, ఇప్పుడు ఈ బయో గ్యాస్ ప్రాజెక్ట్ తో నర్మేట ప్రాంతం పారిశ్రామికంగా మరింత బలోపేతం కానుంది.పర్యావరణ హితం,రైతు సంక్షేమం లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ రంగానికి ఆదర్శంగా నిలవనుంది.