1 May, 2026 | 8:43 PM

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

01-05-2026 07:14 PM

అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్

వనపర్తి,(విజయక్రాంతి): జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ సూచించారు. శుక్రవారం వరి కొనుగోలు ప్రక్రియను పరిశీలించేందుకు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ కొత్తకోట మండలంలోని అప్పరాల, అమడబాకుల, రామకృష్ణాపురం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో కొనసాగుతున్న కొనుగోలు ప్రక్రియను ఆయన సమగ్రంగా పరిశీలించారు.

కేంద్రాల్లో రైతులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే ధాన్యం రికార్డులను పరిశీలిస్తూ నమోదు పత్రాల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని కేంద్రాల ఇన్‌చార్జీలకు అదనపు కలెక్టర్ ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలన్నారు. తేమ శాతం వచ్చిన వెంటనే తూకం చేసి కొనుగోలు పూర్తి చేయాలని, ఆ తర్వాత ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియ వేగంగా జరగాలని తద్వారా రైతులకు నగదు చెల్లింపులు వంటి అంశాల్లో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి సి ఎస్ ఓ కాశీ విశ్వనాథ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.