మంథనిలో వైఎస్సార్ జయంతి వేడుకలు, ఘన నివాళులు
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకుల నివాళి
మంథని, జూలై 8(విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మంథనిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు గోట్కారి కిషన్, గోపాల్‌పూర్ మాజీ సర్పంచ్ చంద్రు రాజమల్లు తదితరులు మాట్లాడుతూ వైఎస్సార్ సేవలను స్మరించారు. రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 అంబులెన్స్ సేవలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం, మహిళలకు పావలా వడ్డీ రుణాలు, వృద్ధాప్య పింఛన్లు వంటి సంక్షేమ కార్యక్రమాలతో వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.
అలాగే వైఎస్సార్ సహకారంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు మంథని ప్రాంత అభివృద్ధికి అనేక విద్యా, మౌలిక వసతుల కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.






