8 July, 2026 | 3:14 PM

మంత్రి పర్యటనలో కానరాని విద్యుత్ కాంట్రాక్టర్..!

08-07-2026 02:11 PM

బిజినేపల్లి: మండలంలోని పాలెం విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్ హాజరైనా, నిర్మాణ బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టర్ లేదా అతని అధికార ప్రతినిధులు ఎవరూ కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. బుధవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాలెం విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

అయితే ఉపకేంద్ర నిర్మాణ వివరాలు, సామర్థ్యం, సాంకేతిక అంశాలపై వివరాలు తెలుసుకోవాలనుకున్న మంత్రి, ప్రజాప్రతినిధులకు సరైన సమాచారం అందించే బాధ్యత కలిగిన కాంట్రాక్టర్ ప్రతినిధులు లేకపోవడంతో నిరాశ ఎదురైంది. ప్రోటోకాల్ ప్రకారం ఇటువంటి ప్రారంభోత్సవాలకు కాంట్రాక్టర్ లేదా అతని అధికార ప్రతినిధులు హాజరుకావాల్సి ఉండగా, ఒక్కరు కూడా కనిపించకపోవడం విమర్శలకు తావిచ్చింది. అధికారులు, ప్రజాప్రతినిధుల పట్ల కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని కార్యక్రమానికి హాజరైన పలువురు అభిప్రాయపడ్డారు. మంత్రి, జిల్లా కలెక్టర్ పాల్గొనే కార్యక్రమానికి కూడా కాంట్రాక్టర్ గైర్హాజరు కావడంపై స్థానికంగా చర్చ జరుగుతుండగా, ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.