ఎన్యుమరేషన్ ఫారాల్లో వాస్తవ వివరాలే నమోదు చేయాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 26(విజయ క్రాంతి): కెరమెరి మండలం మల్లంగి గ్రామంలో శుక్రవారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, వివరాల నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె. హరిత క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఫారాల పంపిణీ, నమోదు తీరును పరిశీలించిన ఆమె, ఓటర్లు ఫారాల్లో వాస్తవ వివరాలనే నమోదు చేయాలని సూచించారు.
బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేసి, బీఎల్‌ఓ యాప్లో నమోదు చేయడంతో పాటు, నింపిన ఫారాలను తిరిగి సేకరించి ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
మరణించినవారు, గ్రామం విడిచి వెళ్లినవారు, ఒకటి కంటే ఎక్కువ ఎపిక్ కార్డులు కలిగిన వారి వివరాలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి ఓటరికి ఒకే ఓటరు గుర్తింపు కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జూలై 24 వరకు కొనసాగే ఇంటింటి సర్వేను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని, అవసరమైన చోట బూత్ స్థాయి ఏజెంట్లు, వాలంటీర్లు, యువజన సంఘాల ప్రతినిధులు, కుల పెద్దల సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు.






