09-02-2026 12:00:00 AM
మోర్తాడ్, ఫిబ్రవరి 8 (విజయ క్రాంతి) : మారుతున్న ప్రపంచంలో సాంకేతికతలో కొత్త పుంతలు వస్తున్న వేళ ఇష్టపడి చదివితేనే లక్ష్యాన్ని చేరుకోవచ్చని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బోండ్ల రాజేందర్ అన్నారు. బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం మోర్తాడ్ లో జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులకు విజయ స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా హాజరైన విద్యార్థులకు రాజేందర్ ప్రేరణాత్మకమైన విలువలతో కూడిన విషయాలపై అవగాహన కల్పించారు. నేడు విద్యా విధానాలతో పాటు భోదన పద్ధతులు కూడా మారుతున్నాయని ఇలాంటి పరిస్థితులలో ప్రతీ ఒక్కరు తాము నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా సమయం కేటాయించుకోవాలని అన్నారు. సెలఫోన్ లకు ఎంత దూరంగా వుంటే ఫలితం అంత త్వరగా పొందవచ్చని అన్నారు.
పిల్లల సర్వతో ముఖాభివృద్ధి కోసం తల్లిదండ్రులు ఎంతో తపన పడతారని, వారి చెమట కష్టాన్ని గుర్తెరిగి అడుగు ముందుకు వేయాలని సూచించారు. రానున్నది పరీక్షల సీజన్ కాబట్టి ప్రతీ ఒక్కరు ప్రణాళిక బద్ధంగా సమయాన్ని కేటాయించుకుంటూ చదువుతే ఆశించిన మంచి ఫలితాలు పొందవచ్చని అన్నారు. చదువుతోపాటు ఆధునిక నైపుణ్యాలపై పట్టు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ విజయ స్ఫూర్తి కార్యక్రమానికి ఆర్మూర్ డివిజన్లోని వివిధ పాఠశాలల నుండి దాదాపు 250 మంది పదవ తరగతి విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులందరికీ పరీక్షా ప్యాడ్లు పెన్నులు ఇతర పరీక్ష సామాగ్రి ని నిర్వాహకులు అందజేశారు. బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు శిరిసినహల్ నంబుల గిరి, బడ్జెట్ స్కూల్ అసోసియేషన్ ఫౌండర్ డాక్టర్ షేక్ షఫీ, సెక్రటరీ మీసిమి రవీందర్, ట్రెజరర్ జువ్వి హరీష్ కుమార్, మోర్తాడ్ మండల అధ్యక్షులు నగేష్ పాల్గొన్నారు.