27 March, 2026 | 4:06 AM

‘ఆన్‌లైన్ బెట్టింగ్’ మోసం

27-03-2026 02:18 AM

నలుగురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26 (విజయక్రాంతి): ఆన్‌లైన్‌లో బెట్టింగ్స్ పేరున మోసానికి పాల్పడతున్న నలుగు సైబర్ నేరగాళ్లను సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఒక నకిలీ ప్రకటన చూసి మోసగాళ్ల వలలో చిక్కుకుంది. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా ఆమెను వే1 గేమింగ్ అనే బెట్టింగ్ ప్లాటఫామ్‌లోకి ఆహ్వానించారు. మొదట్లో బోనస్‌లు ఇవ్వడంతో పాటు, సులభంగా డబ్బు డ్రా చేసుకునే అవకాశం కల్పించి నమ్మకం కలిగించారు. నిజమైన సైట్ అని భ్రమపడిన ఆ యువతి.. భారీగా నగదు డిపాజిట్ చేసింది. 

చివరకు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. అప్పటికే సుమారు రూ.30 లక్షలు నష్టపోయింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఈ భారీ నెట్వర్కును ఛేదించారు. నిందితులు రాజేష్ వెంకట రామ న్ (హైదరాబాద్), రుషభ్ జస్వంతరాయ్ గాంధీ (గుజరాత్) కలిసి వన్ స్టాప్ షాపింగ్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నకిలీ సంస్థ ను స్థాపించారని గుర్తించారు. దీని ముసుగులో క్లోజ్‌ఎక్స్‌పే, ట్రస్ట్లీ పే, అకల్ట్ పే తదితర నకిలీ పేమెంట్ గేట్‌వేలను సృష్టించారు.

ఐఎంపీఎస్, యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపి 2% నుండి 3% కమీషన్ దండుకునేవారు. ఈ ఆపరేషన్ నిర్వహించడానికి రాజేష్.. భమిడిపాటి అభిషేక్, అగస్టీన్ విలియమ్స్ (కేరళ)లను ఉద్యోగులుగా పెట్టుకున్నాడు. ఈ కుంభకోణంలో మరో కీలక ఆపరేషన్ ఢిల్లీ నుంచి సాగింది. ఆండీ అలియాస్ షహీర్ అనే వ్యక్తి నకిలీ కంపెనీల పేరిట మ్యూల్ ఖాతాలు తెరిచి, వాటి కేవైసీ వివరాలను గోవాకు చెందిన మన్మీత్ శర్మ అలియాస్ సోనియాకు పంపేవాడు. ఆమె ఆ పత్రాలను సేకరించి అభిషేక్‌కు పంపగా, వాటి ని గుజరాత్‌లోని సూర్యోదయ బ్యాంక్ అధికారులకు చేరవేసేవాడు.

0.75% కమీషన్‌కు ఆశపడిన సూర్యోదయ బ్యాంక్ అధికారులు వీరికి పేమెంట్ గేట్‌వే సేవలు అందించడం గమనార్హం. బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బులో రాజేష్ 5%, సోనియా 5% కమీషన్ తీసుకోగా, మిగతాది ఆండీ ఖాతాకు వెళ్లేది.  ఇలా ఈ ముఠా ఏకంగా రూ.26 కోట్ల లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన రాజేష్ వెంకట రామన్, భమిడిపాటి అభిషేక్, అగస్టీన్ విలియమ్స్, మన్మీత్ శర్మ సోనియా లను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆండీ (ఢిల్లీ), రుషభ్ గుజరాత్ కోసం గాలింపు కొనసాగుతోంది. నిందితుల వద్ద నుంచి రూ.6.5 లక్షల నగదు, 4 ల్యాప్‌టాప్‌లు, 6 మొబైల్ ఫోన్లు, 9 చెక్ బుక్కులు స్వాధీనం చేసుకున్నారు.