22 August, 2026 | 7:20 PM

ఓపెన్ స్కూల్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

22-08-2026 05:45 PM

ఏఐ సెంటర్ కోఆర్డినేటర్ దేసు సతీష్ కుమార్

​గణపురం,(విజయక్రాంతి): వివిధ కారణాల వల్ల చదువుకు దూరమైన వారు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ కల్పిస్తున్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని గణపురం మండల ఏఐ సెంటర్ కోఆర్డినేటర్ దేసు సతీష్ కుమార్ కోరారు. చదువు మధ్యలో నిలిపివేసిన వారు తిరిగి విద్యాభ్యాసాన్ని కొనసాగించడానికి ఓపెన్ స్కూల్ ఒక చక్కటి వేదికని ఆయన పేర్కొన్నారు. విద్యాభ్యాసానికి వయస్సు, పరిస్థితులు అడ్డంకి కారాదని, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు.

​ఓపెన్ టెన్త్‌లో చేరాలనుకునే వారు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో పాటు నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే ఓపెన్ ఇంటర్మీడియట్ కోసం పదో తరగతి మెమో, ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని సెంటర్‌లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.