7 July, 2026 | 2:39 AM

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

07-07-2026 01:39 AM

కలెక్టర్ మను చౌదరి

మేడ్చల్, జూలై 6 (విజయక్రాంతి): ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను జాప్యం లేకుండా సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులను లా ఆఫీసర్ చంద్రావతి, డిఆర్‌ఓ మాలతి లతో కలిసి 79 దరఖాస్తులు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఎంతో వ్యయ, ప్రయాసలకోర్చుకొని వారి సమస్యలను పరిష్కరిస్తామనే నమ్మకంతో ప్రజలు మన వద్దకు వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని కలెక్టర్ తెలిపారు.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని దరఖాస్తుల పరిశీలనలో ఏలాంటి జాప్యం లేకుండా చూ డాలని కలెక్టరు అన్నారు. అదేవిధంగా తిరస్కరించే దరఖాస్తుల గురించి తిరస్కరణకు గల కారణాలను తప్పనిసరిగా వివరంగా అర్జీదారులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. స్వీకరించిన దరఖాస్తులపై తీసుకున్న చర్యల  వివరాలను ఆన్ లైన్ లో వెంట వెంట నమోదు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టరు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.