ప్రాక్టికల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి
ఘట్ కేసర్, మే 14 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం ఆధ్వర్యంలో థింక్ క్లౌడ్ క్లబ్ నిర్వహించిన హ్యాండ్స్-ఆన్ టెక్నికల్ సెషన్ ఐ-బ్లాక్, రూమ్ నెం. 310 ల్యాబ్లో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ కె.సి. శ్రీధర్, అసోసియేట్ ప్రొఫెసర్ సమన్వయకర్తగా వ్యవహరించగా, 72 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమ ప్రారంభంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతి డాక్టర్ మల్లికార్జునరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, భవిష్యత్తులో క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో ఉన్న విస్తృత అవకాశాలను వివరించి, విద్యార్థులు ప్రాక్టికల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
అమెజాన్ వెబ్ సర్వీసెస్ అకాడమీ సహకారంతో నిర్వహించిన ఈ సెషన్లో విద్యార్థులకు అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ గురించి సిద్దాంతపరమైన అవగాహన కల్పించడంతో పాటు, వర్చువల్ మెషీన్స్, ఇన్స్టెన్స్ టైప్స్, సెక్యూరిటీ గ్రూప్స్, ప్రైసింగ్ మోడల్స్ వంటి అంశాలను వివరించారు. అనంతరం విద్యార్థులు ల్యాబ్లో ప్రత్యక్షంగా ఇన్స్టెన్సులను లాంచ్ చేయడం, కాన్ఫిగర్ చేయడం నిర్వహించడం వంటి ప్రాక్టికల్ కార్యకలాపాల్లో పాల్గొన్నారు.






