సైబర్ నేరాలు, మైనర్ డ్రైవింగ్‌పై అప్రమత్తంగా ఉండాలి
రాజోలి ఎస్‌ఐ కిరణ్ కుమార్
అలంపూర్ జూలై 12: తూర్పు గార్లపాడు గ్రామంలో ఆదివారం రాజోలి ఎస్‌ఐ కిరణ్ కుమార్ గ్రామస్తులకు సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ సూచించారు.
తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైనట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే మైనర్ పిల్లలకు ద్వి చక్ర వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పిల్లల భద్రత దృష్ట్యా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.






