సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై అప్రమత్తంగా ఉండాలి
డీఎస్పీ నల్లపు లింగయ్య
నారాయణపేట, ఆగస్టు 11 (విజయక్రాంతి) : మన ఊరు మన పోలీస్ కార్యక్రమంలో భాగంగా డీఎస్పీ నల్లపు లింగయ్య లింగంపల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామ ప్రజలకు పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీస్ వాల్ ప్రాధాన్యతను డీఎస్పీ వివరించారు. ప్రజలకు పోలీస్ శాఖతో మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడేలా, గ్రామాల్లో శాంతిభద్రతలు, చట్టపరమైన అంశాలు, ప్రజల భద్రతకు సంబంధించిన సమాచారాన్ని చేరవేయడంలో పోలీస్ వాల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, అనుమానాస్పద లింకులు, నకిలీ ఆఫర్లు, బ్యాంకింగ్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ OTP, PIN, CVV, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్వర్డ్లు ఇతరులకు వెల్లడించవద్దని సూచించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు సమాచారం అందించాలని, సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని డీఎస్పీ తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని డీఎస్పీ నల్లపు లింగయ్య అన్నారు. యువత గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
గ్రామంలో మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. గ్రామాల్లో నేరాల నియంత్రణ, నేరస్తులను గుర్తించడం, ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని డీఎస్పీ తెలిపారు. ముఖ్యమైన కూడళ్లు, ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాలు, గ్రామ ప్రవేశనిష్క్రమణ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలు ముందుకు రావాలని సూచించారు.
ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలకు గ్రామ ప్రజలు సహకరించాలని డీఎస్పీ కోరారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం. పోలీసులకు ప్రజలు సహకరిస్తే గ్రామాల్లో నేరాలను మరింత సమర్థవంతంగా నియంత్రించవచ్చు. సైబర్ నేరాలు, డ్రగ్స్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలి అని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్త్స్ర సతీష్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, లింగంపల్లి గ్రామ ప్రజలు, యువత మరియు తదితరులు పాల్గొన్నారు.






