12 August, 2026 | 3:52 PM

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత

12-08-2026 03:09 PM

– ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు

 ఉట్నూర్,(విజయక్రాంతి): సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ పరిధిలోని గిరిజన గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, ఆరోగ్య, పారిశుధ్య సౌకర్యాలను మెరుగుపరచేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి బుధవారం ఐబీ చౌరస్తా వద్ద ఉన్న GRNB గెస్ట్ హౌస్‌ను సందర్శించారు.

ఉట్నూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ జాదవ్ అనిత తో కలిసి సమూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించి, స్థల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం నూతనంగా నిర్మించబోయే ఐటీడీఏ స్థలాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ఆర్డీవో రాథోడ్ మోహన్ సింగ్,ఉట్నూర్ తహసీల్దార్ రఘునాథరావు, ఎంపీడీవో రైసోద్దీన్,ఉట్నూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ తదితర అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.

మారుతిగూడలో అభివృద్ధి పనుల పరిశీలన

 ఇంద్రవెల్లి మండలం మారుతిగూడ గ్రామాన్ని ప్రాజెక్టు అధికారి సందర్శించారు. తహసీల్దార్ ప్రవీణ్ కుమార్,ఎంపీడీవో   మహేందర,గ్రామ పంచాయతీ సర్పంచ్  కుంర్రా  రాజేశ్వర్ సమక్షంలో గ్రామంలో పూర్తయిన MPC భవనాన్ని పరిశీలించారు. భవనాన్ని తక్షణమే వినియోగంలోకి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని, అవసరమైన చోట ఎంపీడీవోకు మార్గదర్శకాలు అందించారు. భవనానికి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం నుంచి సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రాజెక్టు అధికారి తెలిపారు.

అనంతరం గ్రామంలోని PM-JANMAN, ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి, గ్రామ ప్రజలతో మాట్లాడారు. రహదారులు, సీసీ రోడ్ల నిర్మాణం, బోరుబావులు, విద్యుత్ సరఫరా తదితర మౌలిక వసతులపై ప్రజల నుంచి వివరాలు సేకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మొలల్‌గుట్టలో అంగన్వాడీ సిబ్బంది సమస్యపై ఆదేశాలు

అదిలాబాద్ రూరల్ మండలంలోని మొలల్‌గుట్ట గ్రామాన్ని కూడా ప్రాజెక్టు అధికారి సందర్శించారు. అక్కడి MPC భవనాన్ని పరిశీలించిన అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామంలో అంగన్వాడీ టీచర్ అందుబాటులో లేరని గ్రామస్తులు ప్రాజెక్టు అధికారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై DWOతో చర్చించి, అవసరాన్ని పరిశీలించి అంగన్వాడీ టీచర్‌ను వెంటనే నియమించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

PM-JANMAN అంబులెన్స్ సేవలపై సమీక్ష

అనంతరం PM-JANMAN వాహన అంబులెన్స్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందితో ప్రాజెక్టు అధికారి సమావేశమయ్యారు. గిరిజన గ్రామాల్లో అందిస్తున్న వైద్య సేవలు, ప్రజల ఆరోగ్య పరిస్థితులు, సేవల అమలులో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు వైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందేలా అవసరమైన మార్పులను వెంటనే చేపట్టాలని సిబ్బందికి సూచించారు.

ప్రాజెక్టు అధికారి ప్రధాన ఆదేశాలు

  1. ఉట్నూర్ గ్రామంలో సమూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి స్థల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలి.
  2. నూతనంగా నిర్మించబోయే ఐటీడీఏ స్థలానికి సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించి కార్యాచరణ చేపట్టాలి.
  3. MPC భవనాలను త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావడానికి సంబంధిత శాఖల ద్వారా అవసరమైన సహకారం అందించాలి.
  4. గ్రామాల్లో సీసీ రోడ్లు, బోరుబావులు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
  5. అంగన్వాడీ సిబ్బంది కొరత ఉన్న గ్రామాల్లో అవసరాన్ని పరిశీలించి వెంటనే నియామకానికి చర్యలు చేపట్టాలి.
  6. PM-JANMAN అంబులెన్స్ సేవలను నిరంతరం సమీక్షిస్తూ, గిరిజన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలి.

గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రాజెక్టు అధికారి మంద మకరందు స్పష్టం చేశారు. ప్రాజెక్టు అధికారి పర్యటన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన మార్గదర్శకాలు అందాయని అధికారులు తెలిపారు.