13 August, 2026 | 6:53 PM

డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా సీఎం విజయ్ తీర్మానం

12-08-2026 03:30 PM

చెన్నై: డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మాణం చేసింది. లోక్‌సభ సభ్యుల సంఖ్యను శాశ్వతంగా 543గా నిర్ణయించాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్(CM Vijay) బుధవారం అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 2029లో జరగనున్న తదుపరి లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సమర్థిస్తూ, దిగువ సభ (లోక్‌సభ) ప్రస్తుత బలం అయిన 543 స్థానాల ఆధారంగానే ఈ ప్రతిపాదిత కోటాను అమలు చేయాలని ముఖ్యమంత్రి విజయ్(Chief Minister Vijay) తన తీర్మానంలో పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్ తో ముడిపెట్టవద్దని కేంద్రాన్ని కోరారు. 

మహిళలకు రిజర్వేషన్ అనేది ఒక రాయితీ కాదు, అది వారి ప్రజాస్వామ్య హక్కు అని ఆయన నొక్కి చెప్పారు. జనాభా నియంత్రణ కార్యక్రమాలను అమలు చేసిన ఏ రాష్ట్రమూ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన వల్ల ప్రతికూలంగా ప్రభావితం కాకుండా చూడటం కేంద్రం బాధ్యతని విజయ్ తన తీర్మానంలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత, దానిపై మాట్లాడాలని, దానికి మద్దతు ఇస్తున్నారో లేక వ్యతిరేకిస్తున్నారో తెలియజేయాలని స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్ ఎమ్మెల్యేలను కోరారు. తమిళనాడు అసెంబ్లీలో నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా సీఎం విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానానికి డీఎంకే మద్దతు తెలిపింది. 'ఈ సమస్యను మొదటగా ఎత్తి చూపింది మా నాయకుడు స్టాలినే' అని ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు.