సిరుల పంట.. ఆయిల్ పామ్
- టన్నుకు రూ.24,025 ధర
- మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్‌కు 150 టన్నుల గెలలు
మహబూబాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): ఆయిల్ పామ్ పంట (Oil palm crop) మంచి దిగుబడి ఇస్తూ రైతులకు సిరులు కురిపిస్తోంది. ఆగస్టు నెలతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో టన్ను పామాయిల్ గెలల ధర 500 రూపాయలు పెరిగి టన్నుకు 24,025 రూపాయలు లభించింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ గెలల సేకరణ కేంద్రానికి బుధవారం దాదాపు 150 టన్నులకు పైగా ఆయిల్ పామ్ గెలలను రైతులు విక్రయానికి తీసుకువచ్చారు.
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో 2,200 మంది రైతులు సుమారు తొమ్మిది వేల ఎకరాలకు పైగా ఆయిల్ పామ్ సాగు చేపట్టారు. నాలుగేళ్ల క్రితం సాగు చేపట్టిన రైతులకు ఆయిల్ పామ్ గెలల దిగుబడి వస్తోంది. గత నెలలో టన్నుకు 23,350 రూపాయల ధర లభించగా, ఇప్పుడు ఏకంగా టన్నుకు 675 రూపాయల ధర అదనంగా లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసముద్రంలో రైతుల నుంచి సేకరించిన ఆయిల్ పామ్ గెలలను సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ రిఫైండ్ ఫ్యాక్టరీకి లారీల్లో తరలిస్తున్నారు.
ఇక్కడ రైతుల నుండి సేకరించిన ఆయిల్ పామ్ గెలలకు వే బ్రిడ్జి ద్వారా కాంట నిర్వహించి రైతులకు ఆన్లైన్ ద్వారా ఫ్యాక్టరీ యాజమాన్యం ఖాతాల్లో డబ్బులను జమ చేస్తుంది. కోమటిపల్లి గ్రామానికి చెందిన రైతు రావుల మల్లేశం 7 ఎకరాల్లో నాలుగేళ్ల క్రితం ఆయిల్ పామ్ పంట సాగు చేయగా, 20 రోజులకు ఒకసారి రెండు నుంచి మూడు టన్నుల దిగుబడి వస్తుంది. ధర ఆశాజనకంగా ఉందని, కోతుల బెడద లేని పంటగా ఎంతో ప్రయోజనకరంగా ఉందని చెప్పారు.






