20 March, 2026 | 3:32 AM

చమురు సంక్షోభం

20-03-2026 12:07 AM

పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రమైంది. యుద్ధం ప్రారంభమై దాదాపు మూడు వారాలు కావొస్తున్నది. ఇరాన్ మరింత దూకుడుగా దూసుకెళ్తున్నది. అమెరికా మాత్రం ఒంటరిగా మిగిలింది. నాటో దేశాలు, యూరోపియన్ యూనియన్ కూడా అగ్రరాజ్యానికి మద్దతు ఇవ్వలేమని తేల్చేశాయి. సైనిక సహకారం అందించలేమని కొన్ని ఐరోపా దేశా లు వెనక్కి తగ్గుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం తమ దేశ ఆయుధ సంపత్తిని వెచ్చించలేమని చెప్తున్నాయి.

ఈ పరిణామాలన్నీ అగ్రరాజ్యాధినేత ట్రంప్‌ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిల బెట్టేలా చేశాయి. ఏది ఏమైనప్పటికీ, ఇరాన్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. మునుపటి కంటే దూకుడుగా యుద్ధంలో దూసుకెళ్తున్నది. యుద్ధం ఇప్పుడు ఆ దేశ ఉనికికి, ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యగా మా రింది. తమ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం, టెహ్రాన్‌లోని బాలికల విద్యాలయంపై జరిగిన వైమానిక దాడి కొత్త ప్రభుత్వ తీరును పూర్తిగా మార్చివేసింది.

160 మందికి పైగా అమాయక బాలికలు ప్రాణాలు కోల్పోవడాన్ని ఆ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతున్నది. దీనిలో భాగంగానే ఇజ్రా యెల్ ప్రధాని నెతన్యాహును అంతం చేయడమే తమ ఏకైక లక్ష్యమని బహిరంగంగా ప్రకటించింది. శాంతి మంత్రం పక్కన పెట్టి యుద్ధ మా ర్గాన్ని ఎంచుకుంది. మరింత ఉధృతంగా గల్ఫ్ దేశాల్లోని కీలకమైన చము రు శుద్ధి కేంద్రాలను టార్గెట్ చేస్తూ క్షిపణులు, డ్రోన్ల ద్వారా ధ్వంసం చేస్తున్నది.

దీనిలో భాగంగానే సౌదీ అరేబియాలోని అబ్కైక్, ఖురైస్ చమురు శుద్ధి కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఫలితంగా రెండు కేంద్రాల్లో చమురు ఉత్పత్తి సగానికి పడిపోయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని జెబెల్ అలీ రిఫైనరీ, కువైట్‌లోని కొన్ని చమురు నిక్షేప కేంద్రాలపైనా ఇరాన్ దాడులు చేసి ధ్వంసం చేసింది. దాడుల్లో ఆయా కేంద్రాల్లోని మౌలి క సదుపాయాలు దగ్ధమవడంతోపాటు లక్షల బ్యారెళ్ల ముడిచమురూ బూడిదపాలైంది.

దీనికి తోడు ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో పర్షియన్ గల్ఫ్ నుంచి బయటకు రావాల్సిన  చమురు నౌకలు చిక్కుకుపోయాయి. భారత్, చైనా, జపాన్ వంటి ఆసియా దేశాలకు వెళ్లాల్సిన చమురు సరఫరాలో దాదాపు 30 శాతం నుంచి 40 శాతం వరకు అంతరాయం కలిగింది. ఈ జలసంధి గుండానే ప్రపంచవ్యాప్తంగా మూడో వంతు చమురు రవాణా జరుగుతుంది. జలసంధి మూతపడటంతో అనేక దేశాల్లో చమురు, ఎల్పీజీ కొరత వచ్చింది.

యుద్ధం ఇప్పుడు కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు. ఇది పూర్తిస్థాయి చమురు యుద్ధంగా మారిపోయింది. సకాలంలో చమురు అందక ఇప్పటికే కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సంక్షోభం ఏర్పడింది. కొన్ని దేశాలకు ద్రవ్యోల్బణం ముప్పు కూడా పొంచి ఉంది. ఈ యుద్ధం అంతర్జా తీయ మార్కెట్లనూ ప్రభావితం చేసింది. అనిశ్చితి వల్ల స్టాక్ మార్కెట్లలో మదుపర్ల సంపద భారీ గా ఆవిరైంది.

భారత కరెన్సీలో అది సుమారు రూ.1౪ లక్షల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ట్రంప్ తన దూకుడు తగ్గించుకోకపోతే, మున్ముందు మరిన్ని విపత్కర పరిస్థితులు చోటుచేసుకుంటాంయని అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో రగులుతున్న ‘యుద్ధకాష్ఠం’ ఎప్పుడు చల్లారుతుందనే ప్రశ్నకు ఇక కాలమే సమాధానం చెప్పాలి.