20 March, 2026 | 8:05 AM

ఆరోగ్యకరమైన జీవన శైలితోనే గుండెపోటు నివారణ

20-03-2026 12:00 AM

ఎల్లబోయిన వెంకటేశ్వర్లు :

చిన్నవయసులోనే గుండెపోటు మరణాలు పెరగడం నేడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ప్రస్తుతం 18 నుంచి 45 ఏళ్ల మధ్య యువత ను కబళిస్తున్నది. హర్యానాలో గడిచిన ఆరేళ్లలో దాదాపు 18 వేల మంది యువకులు గుండెపోటుతో మరణించారని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ సాక్షిగా వెల్లడించడం సంచలనం సృష్టించింది.

ఆ రాష్ట్రంలో 2020లో గుండెపోటు మరణరాలు 2,394 నమోదవగా, 2025 నాటికి ఆ సంఖ్య 3,255కి పెరగడం ఆందోళనకరం. యువతలో ఈ తరహా మరణాలు పెరగడం దేశ ఆర్థిక సామాజిక నిర్మా ణాలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతున్నది. అసలు యుక్త వయస్సులోనే గుండెపోటు ము ప్పు ఎందుకు పెరుగుతున్నదనే ప్రశ్న ఇప్పుడు ప్రతిఒక్కరినీ వెంటాడుతున్నది. ఉరుకుల పరుగుల జీవనశైలే అందుకు ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు.

వారి అభిప్రాయాల ప్రకారం.. ప్రతిరోజూ కొద్దిసేపైనా వ్యా యామం చేయకపోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగి రక్తనాళాలు పూడుకుపోతున్నా యి. ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయి జంక్ ఫుడ్ వాడకం పెరిగింది. ఇది శరీర మెటమాలిజాన్ని తగ్గిస్తున్నది.ఆ ప్రభావం గుండెపైనా పడుతున్నది. పొగ తాగడం, మద్యపానం వంటి అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని చిన్న వయసులోనే దెబ్బతీస్తున్నాయి. నేటి పోటీ ప్రపంచంలో మానసిక ఒత్తిడి ఒక నిశ్శబ్ద హంతకిలా మారింది.

ఉద్యోగాల వేటలో ఎదురయ్యే సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు యువతను కుంగుబాటుకు గురిచేస్తున్నాయి. ఒత్తిడి పెరిగినప్పుడు శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు గుండెపై అదనపు భారాన్ని మో పుతున్నాయి. దీనివల్ల రక్తపోటు అదుపు తప్పి హఠాత్తుగా గుండెపోటుకు దారితీస్తోంది. టెక్నాలజీ యుగంలో శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల గుండె కండరాలు బలహీనపడుతున్నాయి. గంటల తరబడి కూర్చుని పని చేసే జీవనశైలి ప్రాణాంతకంగా మారుతున్నది.

ఉరుకుల పరుగుల జీవితంలో కనీసం వ్యాయామం చేయడానికి సమయం లేదనే సాకుతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. పట్టణీకరణ పెరగడం వల్ల కాలుష్యం, కల్తీ ఆహారం వంటి సమస్యలు తోడవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో షిఫ్టుల వారీ గా పనిచేసే వారిలో నిద్ర లేమి సమస్య తలెత్తుతున్నది. సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటున్నది. ఆ ప్ర భావం నేరుగా గుండె పనితీరుపై ప్రభావం చూపి రక్తపోటు పెరగడానికి కారణమవుతున్నది.

కరోనా సంక్షోభం తర్వాత గుండెపోటు మరణాలు పెరిగాయనే అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయి. వైరస్ ప్రభావం వల్ల లేదా వ్యాక్సిన్ వల్ల ఇలా జరుగుతోందా? అనే అంశంపై శాస్త్రీయ అధ్యయనాలు జరగాల్సి ఉంది. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని ప్రభుత్వాలు చెబుతున్నాయి.

ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలంటే లోతైన పరిశోధనలు అత్యవసరం. శాస్త్రీయ సమాచారం లేకపోతే ప్రజలు ఆరోగ్యం విషయంలో, సాధారణ పౌరులు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వాల పాత్ర ఎంతో కీలకంగా ఉండాలి. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో గుం డె ఆరోగ్యంపై విస్తృత అవగాహన కల్పించాలి.

 వ్యాసకర్త సెల్: 81849 40814