21 April, 2026 | 2:00 AM

ప్రజావాణి ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలి

21-04-2026 12:41 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, ఏప్రిల్, 20 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర స్థాయి గ్రీవిన్స్ లకు కూడ అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు దరఖాస్తు లను పరిష్కరించాలన్నారు. వేసవిలో ప్రజల కొరకు ప్రతి గ్రామపంచాయతీలో బస్ స్టాప్, పబ్లిక్ ప్రాంతాలలో, ఉపాధి హామీ పనులు జరిగే చోట, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఎండ తీవ్రత దృష్ట్యా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉదయం 11:30 నుండి సాయంత్రం 4:00 వరకు కొనుగోళ్లు నిలిపివేయాలని, తదుపరి 4 గంట నుండి రాత్రి వరకు అవసరమైతే ఫ్లడ్ లైట్లు పెట్టుకొని రాత్రి 10:00 వరకు కూడ నిర్వహించుకోవాలన్నారు.

ఉదయం 4 గంటల నుంచి కూడ కొనుగోళ్లు ప్రారంభించుకోవచ్చన్నారు.జనన గణనలో భాగంగా ఏప్రిల్, 26 నుండి ప్రారంభమగు హౌస్ లిస్టింగ్ లో ప్రతి ఉద్యోగి సొంతంగా వారి యొక్క కుటుంబ వివరాలు, 33 ప్రశ్నలకు వివరాలు అందించాలన్నారు. వెన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు, వారికి ఆ నివేదికను అందించాలని కలెక్టరేట్ లోని ప్రతి శాఖ వారి పరిధిలో గల మండల, గ్రామ కార్యాలయాల పరిధిలో గల సిబ్బంది ద్వారా ప్రజలకు జనన గణన గురించి అవగాహన కల్పించాలని అన్నారు.

సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భూ సమస్యలకి సంబందించి 31 దరఖాస్తులు,డిఆర్డిఏ 4, మున్సిపాలిటీ 3, డిపిఓ 3, డిఎం అండ్ హెచ్ ఓ 3, వివిధ శాఖలకు సంబంధించి 17 దరఖాస్తులు మొత్తం 61 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కే.సీతారామా రావు, జడ్పీ సీఈఓ శిరీష, డిపిఓ యాదగిరి, డిఎంహెచ్వో పి వెంకటరమణ, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, సిపిఓ కిషన్, డీఎస్‌ఓ, డిటిడిఓ శంకర్, ఎస్సీ కార్పొరేషన్ డెవలప్మెంట్ అధికారి దయానందరాణి తదితరులు పాల్గొన్నారు.