1 July, 2026 | 5:34 PM

జీఓ నంబర్ 12ను వెంటనే రద్దు చేయాలి

01-07-2026 04:50 PM

సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ 

దమ్మపేట,(విజయక్రాంతి): భవన నిర్మాణ సంక్షేమ బోర్డు స్కీములను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దని, వెల్ఫేర్ బోర్డు నుండి సంక్షేమ పథకాలు కార్మికులకు అందించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. బుధవారం తాపీ కార్మికుల సమస్యలపై తాసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ స్వప్నకు వినతి పత్రం అందజేశారు. అనంతరం పిట్టల అర్జున్ మాట్లాడుతూ... భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డు ఫలాలు కార్మికులకు అందనివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 12 తీసుకువచ్చి భవనిర్మాణ కార్మికులకు చెందవలసిన కోట్ల రూపాయల నిధులను ఒక బ్రోకర్ సంస్థకు కట్టబెట్టడం దుర్మార్గమని అన్నారు.

కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేని సిఎస్సి హెల్త్ టెస్టులు చేస్తూ వందల కోట్లు వెల్ఫేర్ బోర్డు చెస్ నిధులను దుబారా చేస్తున్నారని అన్నారు. కార్మికుల పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ కు నిధులు వెంటనే విడుదల చేయాలని, సహజ మరణానికి నష్టపరిహారం 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచాలని, 55 సంవత్సరాల నిండిన కార్మికులకు పెన్షన్ నెలకు 6000 రూపాయలు ఇవ్వాలని, వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీని వెంటనే నియమించాలని, సెస్ నిధులు కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు దయాకర్, నారాయణ, రాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.