'ఛాత్రోన్ కి గూంజ్ ద్వారా యువత స్వరాన్ని దేశానికి వినిపిద్దాం
* ఆగస్టు 9న ఢిల్లీ చలో'ను విజయవంతం చేయాలి: ఆత్రం సుగుణక్క
ఉట్నూర్,(విజయక్రాంతి): యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో "ఛాత్రోన్ కి గూంజ్" కార్యక్రమం బుధవారం నార్నూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కొమరం భీమ్ ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో లక్షలాది మంది యువత చదువులు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, పోటీ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు, నియామకాల్లో జాప్యం వల్ల విద్యార్థులు, నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోతున్నారని సుగుణక్క అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, పోటీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని, యువత భవిష్యత్తుతో ఆటలు ఆడవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను దేశ రాజధానిలో గట్టిగా వినిపించేందుకు ఆగస్టు 9న నిర్వహించే "ఢిల్లీ చలో" కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సుగుణక్క పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోవింద్ రావు, మాజీ సర్పంచ్ గజానంద్ నాయక్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ బ్రిజ్లోల్, డీసీసీ జనరల్ సెక్రటరీ ఎత్మారావు, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు శివరం నాయక్, యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు షేక్ మొహమ్మద్, సేవదళ్ జిల్లా అధ్యక్షులు బానోత్ వీలాష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కెలాష్, మాజీ కోఆప్షన్ నంబర్ దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు.






