10 March, 2026 | 4:26 AM

అక్రమార్కులకు అధికారుల కొమ్ము!

09-03-2026 12:55 AM
  1. శేరిలింగంపల్లి డీసీ ఆఫీసులో ఏసీబీ దాడులు
  2. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల గుర్తింపు
  3. ఏసీపీ, డీసీల టేబుళ్లపైనే నెలల తరబడి దస్త్రాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 8 (విజయక్రాంతి): తాజాగా కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సీఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి సర్కిల్-49 డెప్యూటీ కమిషనర్ డీసీ కార్యాలయంపై ఏసీబీ రంగారెడ్డి రేంజ్ యూనిట్ అధికారులు శుక్రవారం మార్చి 6న ఆకస్మిక దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. కార్యాలయంలోని రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, పెండింగ్ దరఖాస్తులు, సిబ్బంది మొత్తం పనితీరును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఈ తనిఖీల్లో అధికారుల అవినీతి బాగోతం, అక్రమ నిర్మాణాలకు కొమ్ముకాస్తున్న తీరు, పెండింగ్ ఫైళ్ల వెనుక జరుగుతున్న చీకటి దందా బట్టబయలైంది. గత ఏడాది డిసెంబర్ 2వ తేదీన జీహెచ్‌ఎంసీ నుంచి విడిపోయి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చిన శేరిలింగంపల్లి సర్కిల్-49 గతంలో జీహెచ్‌ఎంసీ సర్కిల్-20 లో రికార్డుల ప్రక్షాళన ఇంకా కొనసాగుతోంది.

పునర్వ్యవస్థీకరణ కారణంగా డిసెంబర్ 2కు ముందు ఉన్న రికార్డులు ఆ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో.. డిసెంబర్ 2 నుంచి ఇప్పటివరకు ఉన్న దస్త్రాలను మాత్రమే ఏసీబీ అధికా రులు లోతుగా తనిఖీ చేశారు. ఈ మూడు నెలల కాల వ్యవధిలోనే భవన నిర్మాణ అనుమతుల కోసం ఏకంగా 285 దరఖాస్తులు రా గా, అందులో 134 దరఖాస్తులను ఆమోదిం చి, 21 తిరస్కరించారు. అయితే, మరో 63 దరఖాస్తులు ఇంకా ప్రాసెసింగ్ దశలోనే ఉన్నా యి.ఇతర దరఖాస్తులు ఫీజుల చెల్లింపు, షార్ట్ఫాల్ నోటీసులు, హోల్డ్లో పెట్టడం వంటి వివిధ దశల్లో ఉన్నట్లు విచారణలో తేలింది.

అక్రమ నిర్మాణాలకు వత్తాసు!

అక్రమ నిర్మాణాల విషయంలోనూ టౌన్ ప్లానింగ్ అధికారుల వ్యవహారశైలిపై ఏసీబీ విస్తుపోయింది. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు అనధికారిక నిర్మాణాలపై అధికారులకు 63 ఫిర్యాదులు అందాయి. చాలా కేసుల్లో కేవలం మొక్కుబడిగా నోటీసులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. ముఖ్యంగా 14 కేసుల్లో రెండో నోటీసు ఇచ్చిన తర్వాత కూడా సదరు అక్రమ నిర్మాణాలపై ఎలాంటి ఎన్ఫోర్స్మెంట్ కూల్చివేత లేదా సీజింగ్ చర్యలు తీసుకోకుండా ఫైళ్లను పక్కన పడేశారు.

మరో 10 కేసుల్లో అయితే నిబంధనల ప్రకారం మొదటి నోటీసు తర్వాత గడువు ముగిసినా.. తదుపరి ఇవ్వాల్సిన రెండో నోటీసును అసలు జారీనే చేయలేదు. ఒక కేసులో రెండో నోటీసును సిద్ధం చేసినా, దాన్ని సదరు బిల్డర్‌కు ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా పెండింగ్లో పెట్టారు. నాలుగు కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయని రికార్డుల్లో చూపించారు. కొన్ని అక్రమ నిర్మాణాల ఫైళ్లు ఏకంగా నెలలు, ఏళ్ల తరబడి ఎలాంటి తుది ఆదేశాలు లేకుండానే, ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ తీసుకోకుండానే ఉండిపోవడం అధికారుల, బిల్డర్ల కుమ్మక్కును తేటతెల్లం చేస్తోంది.

మున్సిపల్ అధికారులు, ప్రైవేట్ వ్యక్తుల బిల్డర్లు, ఏజెంట్ల మధ్య జరిగిన పలు అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను సస్పీషియస్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏసీబీ అధికారులు గుర్తించారు. పనులు చేసిపెట్టేందుకు గాను పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ పొందుపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనున్నట్లు ఏసీబీ వెల్లడించింది. 

దరఖాస్తులపై అధికారుల నిర్లక్ష్యం

ప్రాసెసింగ్ దశలో ఉన్న దరఖాస్తుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం, అవినీతి ఏసీబీ దాడుల్లో స్పష్టమైంది. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లలో సెక్షన్ ఆఫీసర్ వద్ద 16, అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఏసీపీ వద్ద 25, సాక్షా త్తూ డెప్యూటీ కమిషనర్ డీసీ వద్ద 22 ఫై ళ్లు ఉన్నట్లు గుర్తించింది. నిబంధనల ప్రకారం కేవలం 21 రోజుల్లోగా దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉన్నప్పటికీ.. ఏకం గా 21 దరఖాస్తులు ఆ గడువును దాటిపోయాయి. వీటిలో ఏసీపీ వద్ద 5 ఫైళ్లు, డీసీ వద్ద 16 ఫైళ్లు గడువు దాటినా దుమ్ముపట్టుకుపోతున్నాయి. ఫైళ్లను ఉద్దేశపూర్వకం గానే తొక్కిపెట్టి నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని, దీని వెనుక లంచాల డిమాండ్ ఉందన్న ఆరోపణలకు ఈ జాప్యం అద్దం పడుతోంది.