23 July, 2026 | 3:59 AM

సీసీఐపై స్పష్టతనివ్వాలి

23-07-2026 03:05 AM
  1. ఆదిలాబాద్‌లోని పరిశ్రమ పునరుద్ధరణపై ప్రతిపాదనలే లేవు
  2. ప్రభుత్వం తీరు క్షమించరానిది
  3. సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కర్మాగారం పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. సీసీఐ కేవలం ఒక పరిశ్రమ కాదని, వేలాది కుటుంబాలకు జీవనాధారం, ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామిక భవిష్యత్తు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశమని పేర్కొన్నారు.

ఇటీవల సీసీఐ సాధన సమితి ప్రతినిధులు, బీఆర్‌ఎస్ నేతలతో కలిసి కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని ఢిల్లీలో కలిసిన సందర్భంగా సీసీఐ పునరుద్ధరణపై కీలక చర్చ జరిగినట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రూ.250 కోట్ల పెట్టుబడితో ముందుకు వస్తే ఆదిలాబాద్ సీసీఐ ప్లాంట్ పునరుద్ధరణ సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి తమకు స్పష్టం చేశారని వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు, రాయితీలు లేదా సహకారంపై స్పష్టత లేకపోవడం వల్లే ప్రక్రియ ఆలస్యమవుతోందని కేంద్ర మంత్రి చెప్పినట్లు లేఖలో పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, గత రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆరోపించారు. కేంద్రంతో కలిసి ముందుకు వెళ్లడం సాధ్యం కాకపోతే, రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పరిశ్రమను పునరుద్ధరించే ప్రత్యామ్నాయ ప్రణాళికను కూడా ప్రకటించలేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా  సీసీఐని తిరిగి ప్రారంభిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

అధికారంలోకి వచ్చి న తర్వాత ఆ హామీలను విస్మరించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటివరకు అధికారిక చర్చలు జరపకపోవడం, అవసరమైన ప్రతిపాదనలు పంపకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సీసీఐ పునరుద్ధరణ కోసం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆ ర్ ప్రధానమంత్రికి లేఖ రాశారని, తాను పరిశ్రమల శాఖ మంత్రిగా కేంద్ర భారీ పరిశ్రమ ల శాఖకు పలుమార్లు విజ్ఞప్తి చేశానని కేటీఆర్ గుర్తు చేశారు.

టీఎస్-ఐపాస్ కింద అన్ని రాయితీలు ఇవ్వడంతో పాటు, కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో పరిశ్రమ నిర్వహించేందు కు, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీ నం చేసుకుని నడిపేందుకు కూడా సిద్ధమని అ ప్పట్లో ప్రతిపాదించామన్నారు. అయితే అ ప్పట్లో రాజకీయ కారణాలతో కేంద్రం ముం దుకు రాలేదని, ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్ర భుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం మౌనం పాటించడం క్షమించరానిదని అన్నారు.

ప్రభుత్వానికి ఆరు ప్రశ్నలు

సీసీఐపై ప్రభుత్వానికి కేటీఆర్ ఆరు ప్రశ్నలు సంధించారు. సీసీఐ పునరుద్ధరణపై ప్రభుత్వ వైఖరి ఏమిటి?, కేంద్రానికి ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదనలు పంపారు?, రూ.250 కోట్ల రాష్ట్ర వాటా పెట్టుబడికి ప్రభుత్వం సిద్ధమేనా?, టీఎస్-ఐపాస్ తరహా రాయితీలు ఇస్తుందా? కేంద్ర-,రాష్ట్ర సంయు క్త భాగస్వామ్యానికి అంగీకరిస్తుందా?, కేంద్రం ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వ మే పరిశ్రమను పునరుద్ధరించే కార్యాచరణ ఉందా? అనే అంశాలపై వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆదిలాబాద్ జి ల్లా ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకతీతంగా ప్రభుత్వం వెంట నే నిర్ణయం తీసుకుని, కేంద్రానికి అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కేటీఆర్ కో రారు. అవసరమైతే సీసీఐ సాధన సమితి తో కలిసి ముఖ్యమంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు వినతిపత్రం సమర్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని  పేర్కొన్నారు.