23 July, 2026 | 4:14 AM

భిన్నత్వంలో ఏకత్వం

23-07-2026 03:22 AM
  1. జంతర్ మంతర్ సమీకరణంతో తేటతెల్లం
  2. ‘జెన్ జీ’ అకస్మాత్తుగా  చేపట్టిన నిరసన  
  3. ప్రజాస్వామ్య వ్యవస్థలోని లోపాలు బట్టబయలు
  4. ప్రధాన మీడియా తీరుపై అసంతృప్తి

 హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి) : న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ ఒక సాధారణ పర్యాటక ప్రదేశం స్థాయి నుంచి యు వత తిరుగుబాటుకు వేదికగా రూపాంతరం చెందింది. నీట్ 2026 ప్రశ్నాపత్రం లీకేజీపై తీవ్ర ఆగ్రహంతో ప్రారంభమైన ఈ ఆందోళన, క్రమంగా దేశవ్యాప్తంగా వ్యవస్థాగత వైఫల్యాలు, పోలీసుల అతిక్రమణలు, యువత భవిష్యత్తు పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిరాసక్త వైఖరికి నిరసనగా మారింది.

ఇది ఏ రాజకీయ పార్టీల ప్రమేయంతోనో, జెండాల నీడలోనో జరిగిన నిరసన కానే కా దు. కేరళ నుంచి అస్సాం వరకు యువకులు, విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివచ్చా రు. నిజమైన భిన్నత్వంలో ఏకత్వం అంటే కేవలం నినాదం మాత్రమే కాదు, ఆచరణాత్మక రూపమని ఈ ఉద్యమం నిరూపిం చిం ది.

ప్రారంభ రోజుల్లో ఈ నిరసన ఎంతో క్రమశిక్షణతో సాగింది. తీవ్ర ఉద్రిక్తతల నడు మ కూడా విద్యార్థులు శాంతియుతంగా వ్యవహరించారు. జూన్ 28న ప్రముఖ సామాజికవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఈ ఉద్యమానికి మరింత బలాన్ని చేకూర్చింది.  

 ‘జెన్ జీ’ చైతన్యం..

అసలు ఈ తరం యువత (జెన్ జీ) రోడ్లపైకి రావడానికి కారణమేమిటి? సంప్రదా య రాజకీయాలు వీరి ఆకాంక్షలను, ఉద్యోగ అనిశ్చితిని, అలాగే డిజిటల్ తరంగంగా ఉన్న వీరి కోపాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాయి. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్, వ్యవస్థాగత విశ్వాసఘాతాన్ని ప్రతిబింబించే ఒక్క చిత్రం.. వరుస పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఆత్మహత్యలు, తుడిచిపెట్టు కుపోతున్న ఉద్యోగాలు వీరందరినీ క్షణాల్లో ఏకం చేశాయి.

నీట్ పరీక్షలో అక్రమాలు, ఇతర పోటీ పరీక్షల స్కాములు, లక్షలాది మందిని వేధిస్తున్న నిరుద్యోగ సమస్య ఈ నిరసనలకు ప్రధాన కారణాలు. పార్లమెంట్ వైపు చేపట్టిన పాదయాత్ర తీవ్ర ఘర్షణలకు దారితీసింది. లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్ర యోగంతో దాదాపు 180 మంది గాయపడ్డారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసమే చర్య లు తీసుకున్నామని ఢిల్లీ పోలీసులు పేర్కొనగా..

పోలీసుల వైఖరి అత్యంత క్రూరంగా ఉందని, ముఖ్యంగా విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.అయితే ఇదే సందర్భంలో న్యాయ వ్యవస్థ స్పందించిన తీరు విద్యార్థులలో మరింత నిరాశను నింపింది. పోలీసుల చర్యలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్య కాం త్ తోసిపుచ్చుతూ.. మా సమయాన్ని వృథా చేయకండి.. మాకు వీడియోలు చూసే ఆసక్తి లేదని వ్యాఖ్యానించారు. 

దేశవ్యాప్త స్పందన..- మద్దతు..

ఈ ఉద్యమానికి మద్ధత్తు దేశవ్యాప్తంగా వ్యాపించింది. విదేశాల్లోని భారతీయులు కూడా ఆన్‌లైన్ ద్వారా వీరికి మద్దతు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), రెడిట్ వంటి వేదికలపై ధర్మేంధ్ర ప్రధాన్ రిజైన్, జస్టిస్ ఫర్ స్టుడెంట్స్, ఎగ్జామ్ మాఫియా, యూత్ ఫర్ జస్టిస్ హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి. ఇది ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం కాదని, తమ భవిష్యత్తు కోసం చేస్తున్న ధర్మపోరాటమని వారు స్పష్టం చేశారు. 

మీడియా తీరుపై అసంతృప్తి..

ప్రధాన స్రవంతి టీవీ ఛానెళ్లు శాంతియుత నిరసనను, ఉద్యమ తీవ్రతను పక్కనపెట్టి కేవలం హింసపైనే దృష్టి సారించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. గోదీ మీడియా గో బ్యాక్ అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. 

విద్యార్థులకు ఉచిత భోజనం

పిజ్జాలు, సమోసాలు, టీ... ఇలా భారత్ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా జంతర్ మంతర్ నిరసన ప్రాంగణానికి ఆహార పదార్థాలు భారీగా తరలివచ్చాయి. ఈ స్పందన ఎంత ఎక్కువగా ఉందంటే, ఇకపై ఆహారాన్ని పంపవద్దని మద్దతుదారులకు నిర్వాహకులు బహిరంగ విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. స్థానిక గురుద్వారాలు విద్యార్థులకు ఆశ్రయం కల్పించాయి.

ప్రథమ చికిత్సతో పాటు లంగర్ (ఉచిత భోజనం) ఏర్పాటు చేశాయి. ఆపదలో ఉన్నవారికి గురువు నివాసమే ఆశ్రయం అని మధ్య ఢిల్లీలోని గురుద్వారాలు మరొకసారి నిరూపించాయి. వాహే గురూజీ కీ ఖల్సా! అదేవిధంగా, నిరసనకారులు తలదాచుకోవడానికి స్థానిక మసీదులు కూడా తలుపులు తెరిచాయి. వందలాది మంది స్వచ్ఛంద సేవకులు జంతర్ మంతర్ వద్ద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించారు.

ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు

ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు సహా దేశంలోని అనేక నగరాలలోని విశ్వవిద్యాలయ క్యాంపస్‌లు విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు చేపట్టాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇందుకు మినహాయింపుగా నిలిచింది. సోషల్ మీడియాలో కొన్ని ప్రకటనలు, రాజకీయ విద్యార్థి విభాగాల పరిమిత కార్యకలాపాలు మినహా, రాష్ట్రంలోని కళాశాల క్యాంపస్‌లలో ప్రత్యక్ష నిరసనలు పెద్దగా కనిపించలేదు.

మా సమయాన్ని వృథా చేయొద్దు: సీజేఐ సూర్య కాంత్

‘మా సమయాన్ని వృథా చేయకండి’.. విద్యార్థులపై పోలీసుల చర్యను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ చేసిన వ్యాఖ్య ఇది. మాకు వీడియోలు చూసే ఆసక్తి లేదు, చూడటానికి సమయం కూడా లేదని పోలీసుల దౌర్జన్యాలను చూపే వీడియోలు ఉన్నాయని తెలిపిన లాయర్‌తో సీజేఐ పేర్కొన్నారు. (దేశంలో రాజ్యాంగాన్ని, న్యాయాన్ని పరిరక్షించాల్సిన అత్యున్నత స్థానంలో ఉన్న సీజేఐ సూర్య కాంత్ దారుణమైన పోలీసు చర్యలపై విచారణను ‘సమయం వృథా’గా భావించడం గమనార్హం).