1 August, 2026 | 3:59 AM

శేరిలింగంపల్లిలో అధికారుల నిర్లక్ష్యం!

01-08-2026 12:00 AM
  1. ప్రమాదకర నాలాలు, మ్యాన్‌హోళ్ల వద్ద రక్షణ చర్యలు లేవు
  2. నాలుగు రోజులు గడిచినా లభించని వృద్ధుడి ఆచూకీ 
  3. కుటుంబానికి సాయంచేసి శాశ్వత చర్యలు తీసుకోవాలని డిమాండ్

శేరిలింగంపల్లి, జులై 31 (విజయక్రాంతి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా అమాయక ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని స్థానిక బీఆర్‌ఎస్ సీనియర్ నాయ కులు తీవ్రంగా విమర్శించారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమనగర్ రైల్వే అండర్పాస్ వద్ద ఉన్న ప్రమాదకర నాలాలో పడి గల్లంతైన వృద్ధుడు బాలయ్య (70) ఆచూకీ నాలుగు రోజులుగా దొరకకపోవడం ప్రభు త్వ యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని వారు ఆరోపించారు.

శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేట ర్ బొబ్బ నవతారెడ్డి, అల్లఉద్దీన్ పటేల్, మిద్దె ల మల్లారెడ్డి, పొట్ట నరేందర్ యదవ్, విజ య్ కుమార్ రెడ్డి, సంగారెడ్డి, జనార్దన్ గౌడ్ తదితరులు ఈ విషయంపై ధ్వజమెత్తారు. ని యోజకవర్గంలో ప్రతి వర్షాకాలం ప్రజలకు ప్రాణసంకటం తప్పట్లేదని, మ్యాన్హోళ్లు, తెరిచి ఉన్న నాలాల వద్ద కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణమని వారు అన్నారు.

గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయినా, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు గుణపాఠం నేర్చుకోకపోవడం బాధాకరమని వారు మండిపడ్డారు.బాలయ్య గల్లంతైన తర్వాత జీహెచ్‌ఎంసీ, పోలీసు, ఎన్డీఆర్‌ఎఫ్, హైడ్రా తదితర శాఖల అధికారులు గాలింపు చర్యలు చేపట్టినట్లు చెబుతున్నా, ఇంతవరకు ఫలితం లేకపోవడం సిగ్గుచేటని నాయకులు ఎద్దేవా చేశారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా ఒక వ్యక్తి ఆచూకీ కనుగొనలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని వారు అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే నాలాల వెంట రెయిలింగ్ ఏర్పాటు చేస్తామని ప్రకటనలు చేసే ప్రజాప్రతినిధులు ఆచరణలో చేతులెత్తేస్తున్నారని వారు ఆరోపించారు.కేవలం ప్రాణాలు పోయినప్పుడు మొక్కుబడిగా పరామర్శించి ఫోటోలకు పోజులిచ్చి వెళ్లే సంస్కృతికి స్వస్తి పలకాలని హితవు చెప్పారు.

ఇప్పటికైనా అధికారులు, పాలకులు నిద్రలేచి తక్షణమే బాలయ్య ఆచూకీ కనుగొనాలని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో నాలాలు, మ్యాన్హోళ్ల వల్ల ఇలాంటి ప్రాణనష్టం జరగకుండా శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎం.డీ. సలీం, శ్రీనివాస్ రెడ్డి, రాములు, చారి, చందర్ రావు, శభన, అంజి యాదవ్, అనంత రెడ్డి, రాజశేఖర్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.