13 April, 2026 | 1:42 AM

ఎటు చూసినా మక్కలే

13-04-2026 12:00 AM
  1. విక్రయానికి తొలగని కష్టాలు
  2. కేసముద్రం మార్కెట్లోకి నో ఎంట్రీ 
  3. పెరగని కొనుగోలు కేంద్రాలు 
  4. బీహార్ కార్మికులతో లోడింగ్

మహబూబాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): యాసంగిలో రైతులు పండించిన మక్కలతో మహబూబాబాద్ జిల్లాలో ఎటు చూసినా మక్కలే కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగి సీజన్ లో రికార్డు స్థాయిలో లక్ష నలభై తొమ్మిది వేల ఎకరాల్లో మక్కజొన్న పంట సాగయ్యింది.

సుమారు 4.57 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా. పక్షం రోజుల నుంచి పంట దిగుబడి రావడం ప్రారంభమయ్యింది. అయితే ప్రైవేటు ట్రేడర్లు మక్కలకు క్వింటాల్ గరిష్టంగా 1,900 రూపాయలకు మించకుండా ధర పెట్టక పోవడంతో ప్రభుత్వం మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా మక్కల కొనుగోళ్లకు శ్రీకారం చుట్టింది. క్వింటాలుకు 2,400 ధర పెడుతుండంతో రైతులు మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలకు మక్కలను తెస్తున్నారు.

అయితే జిల్లా వ్యాప్తంగా 18 చోట్ల మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే సాధారణ సాగుకు మించి రెట్టింపుకు పైగా విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగు చేయడం, దిగుబడి కనీసం ఎకరానికి 35 క్వింటాళ్ల వరకు పంట చేతికి రావడంతో ప్రైవేటు ట్రేడర్లు ఆశించిన ధర పెట్టకపోవడం వల్ల, రైతులు మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలకు తరలి వస్తున్నారు. దీనితో కొనుగోలు కేంద్రాలు మక్కలతో కిక్కిరిసి పోయాయి. అలాగే పంట కోత పూర్తి చేసిన రైతులు పంట ఆరబెట్టడానికి స్థలం లేక చివరకు పెట్రోల్ పంపుల్లో సైతం మక్కలు ఆరబోసుకుంటున్నారు.

జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లు మక్కలతో కిక్కిరిసి పోయాయి. కేసముద్రం మార్కెట్లో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రానికి ఇప్పటి వరకు లక్షకు పైగా బస్తాల మక్కలను రైతులు విక్రయానికి తెచ్చారు. ఇందులో ఇప్పటి వరకు 587 మంది రైతులకు చెందిన 53 వేల బస్తాల మక్కలు కొనుగోలు చేసి, ఎగుమతి పూర్తి చేశారు. మరో 45 వేల బస్తాల మక్కలు కాంటాలు పూర్తి చేసి ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉంచారు.

ఎండల తీవ్రత, కార్మికుల కొరత వల్ల కొనుగోలుకు తీవ్ర ఆటంకంగా మారింది. ఈ క్రమంలో రైతులు మార్కెట్ లో రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోంది. ఒక్కో రైతు కనీసం పది రోజుల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ శనివారం మార్కెట్ సందర్శించి మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. దీనితో బీహార్ కార్మికులతో కొనుగోలుకు టోకెన్లు ఇచ్చిన రైతులకు చెందిన మక్కలను యుద్ధ ప్రాతిపదికన కంటాలు నిర్వహించి లారీల్లోకి లోడింగ్ చేయించి గోదాములకు పంపుతున్నారు.

మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, సీఐ సత్యనారాయణ, ఎస్ ఐ క్రాంతి కిరణ్, మార్కెట్ కార్యదర్శి అమరలింగేశ్వర్ రావు, సొసైటీ సీఈవో మల్లారెడ్డి, ఏవో వెంకన్న, మార్కెట్ కమిటీ సిబ్బంది మూడు రోజులుగా మార్కెట్లోనే ఉంటూ మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయిస్తున్నారు. దీంతో మార్కెట్లో పేరుకుపోయిన మరో 50 వేల బస్తాల మక్కలు కాంటాలు పూర్తి చేసి, ఎగుమతి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. 

మార్కెట్లోకి మక్కలకు నో ఎంట్రీ!

కేసముద్రం మార్కెట్లో పేరుకుపోయిన మొక్కజొన్నలను పూర్తిగా క్లియర్ చేసేంతవరకు రైతులు మార్కెట్లోకి మొక్కజొన్నలు తేకూడదని మార్కెట్ కమిటీ ప్రకటించింది. యార్డులో ప్రస్తుతం 50 వేల బస్తాల వరకు మక్కలు పేరుకుపోయాయని, వీటికి కొనుగోలు పూర్తి అయిన తర్వాత మక్కలు కొంటామని, అప్పటివరకు రైతులు మార్కెట్ యార్డుకు మక్కలు తేయకూడదని మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి తెలిపారు. 

కేసముద్రం మండల పరిధి లో ఉన్న రైతులు మాత్రమే మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రానికి మక్కలు తేవాలని, ఇతర మండలాల రైతులు ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లాలని చైర్మన్ కోరారు. రైతులు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సహకరించి తేమ ఉండేలా బాగా ఆరబెట్టి, శుభ్రం చేసి విక్రయానికి తేవాలని, ముందుగా శాంపిల్ తీసుకువచ్చి టోకెన్ తీసుకువెళ్లి తరువాత మక్కలను విక్రయానికి తేవాలని కోరారు.