కులగణనలో ఓబీసీలకు ప్రత్యేక స్థానం కల్పించాలి
బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి.అనంతయ్య
ముషీరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): 2027 జాతీయ జనగణనలో కుల గణనను శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్వహించాలని బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి. అనంతయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్కడ మీడియాతో మాట్లాడుతూ జనగణన ప్రశ్నావళిలోని ప్రశ్న నెం.10ను సవరించి ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీ కేటగిరీని స్పష్టంగా చేర్చాలని కోరారు. ప్రతి కులానికి ప్రత్యేక ప్రామాణిక కోడ్ కేటాయించి, డిజిటల్ జనగణనలో డ్రాప్డౌన్ ఆధారిత కుల కోడింగ్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.
కు లాలను కేవలం ఓపెన్ ఎండెడ్ విధానంలో నమోదు చేస్తే ఒకే కులం వివిధ పేర్లు, పర్యాయపదాలు, ప్రాంతీయ పేర్లతో నమోదై గణాంకాల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల అధికారిక బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల జాబితాలను సమగ్రంగా రూపొందించి, ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ ఇవ్వాలని కోరారు.
ఎన్యూమరేటర్లకు ముందస్తు సాంకేతిక శిక్షణ ఇవ్వడంతో పాటు కులాల నమోదు, కోడింగ్, ధ్రువీకరణకు పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కుల గణనలో ఖచ్చితమైన వివరాలు నమోదు చేస్తే భవిష్యత్తులో విద్య, ఉద్యోగాలు, రిజర్వేషన్లు, సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయ విధానాలకు ఉపయో గపడతాయని ఆయన పేర్కొన్నారు.






