తెల్లనివన్నీ పాలు కావు.. జాగ్రత్త!
చలాది పూర్ణచంద్రరావు :
* పాల కల్తీ కోసం అక్రమార్కులు యూరియా, ఫార్మాలిన్, డిటర్జెంట్లు, అమ్మోనియం సల్ఫేట్, కాస్టిక్ సోడా వంటి భయంకరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారు. పాల సాంద్రతను పెంచేందుకు గంజి పొడిని కలుపుతున్నారు. నీళ్లు కలిపిన పాలు చిక్కగా కని పించేందుకు సబ్బును ఉపయోగిస్తున్నారు. వైట్ పెయింట్‌ను పాలలో కలపడం కల్తీదారుల మితిమీరిన తెలివికి నిదర్శనం. వీటివల్ల మూత్రపిండాల వ్యాధులు, క్యాన్సర్, జీర్ణకోశ సమస్యలు తలెత్తుతున్నాయి.
భారతదేశంలో ఆహార కల్తీ రక్కసి కోరలు చాస్తున్నది. యేటా దేశవ్యాప్తంగా కల్తీ ఆహారం కారణంగా సుమా రు 70 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారనే చేదు నిజాన్ని గణాంకాలు వెల్లడిస్తు న్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక ప్రకారం.. భారత్‌లో యేటా 10 కోట్ల మంది కల్తీ ఆహారం తీసుకుని అనారోగ్యానికి గురవుతున్నారు. ఇందులో 20 శాతం మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. ఫలితంగా నిల్వ ఉంచిన కలుషిత ఆహారం కొనుక్కుని తిని మరీ ప్రజలు రోగాలను కొనితెచ్చుకుంటున్నారు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఆహార భద్రతా ప్రమాణా ల అమలులో ఆంధ్రప్రదేశ్ గత ఐదేళ్ల కాలం లో అట్టడుగు స్థానానికి పడిపోయింది. తెలు గు రాష్ట్రాల్లో పాల కల్తీ నిరంతరాయంగా సాగుతున్న ఒక ప్రమాదకర వ్యాపారంగా మారింది. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి రోజూ వినియోగించే పాలు ఇప్పుడు విషపూరిత రసాయనాలతో నిండిపోతున్నాయి. పాల సాంద్రత పెంచేందుకు గంజి పొడిని వాడుతున్నారు.
పాలు తెల్లగా కనిపించేందుకు అక్రమార్కులు వైట్ పెయింట్ ను ఉపయోగిస్తున్నారు. నిల్వ ఉంచేందుకు ఫార్మాలిన్ వంటి రసాయనాలను వాడుతున్నారు. కేవలం లాభాపేక్షే ధ్యేయంగా నకిలీ పాల రైతులు అవతారమెత్తి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఒక పాడి గేదె పెంపకం దారు వద్ద రెండు మూడు గేదె లు ఉంటే 20 నుంచి 30 మంది వినియోగదారులు ఉంటున్నారు.
ఈ అదనపు పాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో దేవుడికే తెలియాలి. బజారుకొకటి ఉంటున్న ప్రైవేట్ పాల కేంద్రాలు కాన్ల కొద్దీ పాలను విక్రయిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో యూరియా బస్తా ల నిల్వలు కనిపిస్తున్నాయి. పంటలకు దొరకని యూరియా ఇక్కడ నిల్వ ఉండటం వెనుక అసలు పరమార్థం ఇదే.
రాజమహేంద్రవరంలో విషాదం
ఇటీవల రాజమహేంద్రవరంలో కల్తీ పా లు సేవించి ఆరేళ్ల బాలుడితో సహా మొత్తం 14 మంది మరణించడం పెను విషాదాన్ని నింపింది. మరో ఆరుగురు బాధితులు ఇప్పటికీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వ సహకార రంగంలో నడుస్తున్న ఒక డెయి రీ ఉత్పత్తులు కల్తీవన్న వార్త వెలుగులోకి రా వడంతో ప్రజల్లో అంతులేని ఆవేదన వ్యక్తమైంది.
తల్లిపాలు చాలని పసిబిడ్డలకు ఎం తో నమ్మకంతో విజయా పాలను పట్టించే తల్లులు ఈ వార్తతో భయాందోళనలకు గురయ్యారు. అభం శుభం తెలియని పసిగుడ్లకు తామే చేతులారా విషాన్ని ఇస్తున్నామనే ది గులు వినియోగదారుల్లో పెరుగుతోంది. 1965లో స్థాపించిన కృష్ణా మిల్క్ ప్రొడ్యూసర్స్ వెల్ఫేర్ కోఆపరేటివ్ సొసైటీ ఇలా క ల్తీలకు నిలయంగా మారితే సామాన్య వ్యా పారులను అడిగే వారు ఎవరు ఉంటారు?
ఆహార భద్రతా ప్రమాణాల్లో వైఫల్యం
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించిన మార్గదర్శకాల అమలులో కేరళ 73.75 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. తమిళనాడు 67 మార్కులతో ఆ తరువాతి స్థానంలో ఉంది. జమ్మూకాశ్మీర్ 64.25, గుజరాత్ 61.75 మార్కులు సాధించాయి. తెలంగాణ 35.75 శాతం సాధించగా ఆంధ్రప్రదేశ్ కేవలం 27 శాతంతో అట్టడుగున నిలిచింది. అధికారులకు శిక్షణ, సామర్థ్యాల పెంపు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు అథ:పాతాళంలో నిలిచాయి.
గత ప్రభుత్వ హయాంలో నమూనాల సేకరణ, పరీక్షలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఆంధ్రప్రదేశ్ 36 మార్కులకు గాను కేవలం 4 మార్కులు మాత్రమే సాధించింది. అంటే ప్రజల ఆహార భద్రత విషయంలో నాడు ఎంత శ్రద్ధ ఉందో స్పష్టంగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆహార భద్రత పట్ల నిర్లక్ష్యానికి రాజకీయ జోక్యం, బంధుప్రీతి, అవినీతి వంటి అంశాలే ప్రధాన కారణాలుగా పరిశీలకులు పేర్కొంటున్నారు.
నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా పనిచేయాల్సిన విభాగాలు తమ బాధ్యతను విస్మరిస్తున్నాయి. వంటనూనెల నియంత్రణ చట్టం, పాల ఉత్పత్తుల నిరోధక చట్టం వంటి ఎన్నో కఠిన చట్టాలు ఉన్నా అమలులో పారదర్శకత లేదు. అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.
వాస్తవానికి ఇలాంటి వారికి ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే చట్టాలు ఉన్నాయి. కానీ కులం, రాజకీయ జోక్యం వంటి కారణాలతో ఈ చట్టాలు చ ట్టుబండలు అవుతున్నాయి. హోటళ్లు, ఫుట్‌పాత్ బండ్లపై తరచూ దాడులు జరపడం లేదు. ఏదైనా ఉపద్రవం జరిగినప్పుడు మా త్రమే హడావిడి చేసే అధికారులు ఆ తర్వాత మామూలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
రసాయనాలు కలిపితే.. ఇక విషమే..
పాల కల్తీ కోసం అక్రమార్కులు యూరి యా, ఫార్మాలిన్, డిటర్జెంట్లు, అమ్మోనియం సల్ఫేట్, కాస్టిక్ సోడా వంటి భయంకరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారు. పాల సాంద్రతను పెంచేందుకు గంజి పొడిని కలుపుతున్నారు. నీళ్లు కలిపిన పాలు చిక్కగా కని పించేందుకు సబ్బును ఉపయోగిస్తున్నారు. వైట్ పెయింట్ ని పాలలో కలపడం కల్తీ దారుల మితిమీరిన తెలివికి నిదర్శనం. వీటివల్ల మూత్రపిండాల వ్యాధులు, క్యాన్సర్, జీర్ణకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. ఫార్మాలిన్ రసాయనం కాలేయం, మూత్రపిండాలపై హానికరమైన ప్రభావాన్ని చూపు తుంది.
పాలలో లాక్టోమీటర్ పరీక్షలతో కూడా గుర్తించలేని విధంగా కార్బోహైడ్రేట్లు కలుపుతున్నారు. ఇంతటి ప్రమాదకర స్థితి నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆహార భద్రతా శాఖతో తరచూ ఆకస్మిక దాడులు నిర్వహించి కల్తీకి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి. లేనిపక్షంలో సామాన్య ప్రజలు రోగాలపాలై అర్ధాంతరపు చావులకు గురికాక తప్పదు.
వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్
సెల్: 94915 45699




