23 March, 2026 | 9:34 PM

గ్యాస్ కోసం కంగారు అవసరం లేదు...

23-03-2026 07:43 PM

ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్

మునుగోడు,(విజయక్రాంతి): గ్యాస్ సరఫరా విషయంలో వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాహసిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. సోమవారం మునుగోడులోని గ్యాస్ ఏజెన్సీపై ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మాట్లాడారు. వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా గ్యాస్ సరఫరా చేయడానికి చమురు సంస్థలు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాయని తెలిపారు.

గ్యాస్ దొరకదేమో అనే అపోహతో ప్రజలు ముందస్తుగా ఎక్కువ సిలిండర్లు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని కొందరు దుర్వినియోగం చేసుకుని అక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి ఆకస్మిక తనిఖీలు, దాడులు చేపడుతున్నట్లు తెలిపారు.

కొంతమంది గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను హోటళ్లకు విక్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చినట్లు రఘునందన్ వెల్లడించారు. ఇటువంటి అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.వినియోగదారులు గ్యాస్ సరఫరాపై అపోహలు పెట్టుకోకుండా అవసరానికి అనుగుణంగా మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు.