ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ
కరాచీ: వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఒక కీలక సమాచారం వచ్చింది. టోర్నీ ప్రారంభానికి ముందు సంప్రదాయంగా నిర్వహించే కెప్టెన్ల ఫోటో షూట్‌ను ఈసారి నిర్వహించకపోవచ్చని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొన్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం... టోర్నీ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న దేశం కప్‌తో పాటు కెప్టెన్ల ఫోటో షూట్ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే టైట్ షెడ్యూల్ కారణంగా కొన్ని జట్లు ఫోటో షూట్‌కు అందుబాటులో ఉండడం లేదని పీసీబీకి సమాచారం అందింది. దీంతో ఫోటో షూట్‌ను నిర్వహించకూడదని పీసీబీ భావిస్తోంది. టోర్నీలో పాల్గొంటున్న టాప్d జట్లలో ఇంగ్లండ్ భారత్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బిజీగా ఉండగా.. ఆస్ట్రేలియా, శ్రీలంక టెస్టు సిరీస్ అనంతరం వన్డే సిరీస్ ఆడనున్నాయి. ఫిబ్రవరి 16న జరగాల్సిన ఫోటో షూట్‌కు ఆయా జట్ల కెప్టెన్లు రావడం అనుమానంగా మారింది.
ముఖ్యంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మను చాంపియన్స్ ట్రోఫీ ఫోటో షూట్‌కు పాక్‌కు పంపించేందుకు బీసీసీఐ ఇష్టపడడం లేదు. తాజాగా పీసీబీ ఫోటో షూట్ లేనట్లేనని అనధికారిక ప్రకటన విడుదల చేయడంతో ఆ సమస్య కూడా తప్పినట్లయింది. ఇక టోర్నీ ఆరంభ వేడుకలను లాహోర్‌లోని హుజూర్ బాగ్‌లో నిర్వహించాలని పీసీబీ భావిస్తోంది. కాగా పీసీబీ ఫిబ్రవరి 7న కొత్తగా పునరుద్ధరించిన గడాఫీ స్టేడియాన్ని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీప్ చేతుల మీదుగా ప్రారంభించనుంది. ఫిబ్రవరి 11న కరాచీ స్టేడియాన్ని ప్రారంభించేందుకు అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారీ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్ని యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు. భద్రతా కారణాల రిత్యా పాక్‌లో అడుగుపెట్టేందుకు భారత్ నిరాకరించడంతో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ షార్జా, దుబాయ్ వేదికలుగా జరగనున్నాయి. ఒకవేళ భారత్ ఫైనల్ చేరితే టైటిల్ పోరు కూడా దుబాయ్‌లోనే జరగనుంది.