నితిన్ నబీన్ వ్యాఖ్యలు అర్థరహితం
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): గిరిజనుల కోసం బీజేపీ ప్రభుత్వం చేసినది శూన్యమని, కేసీఆ్ప విమర్శలు చేసే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా క్యాంప్ కార్యాలయంలో జడ్పీ మాజీ చైర్ పర్సన్ ఆంగోత్ బిందుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత గిరిజనుల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకువచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం, 10 శాతం గిరిజన రిజర్వేషన్ అమలు చేయడం, గురుకుల విద్యాసంస్థలను విస్తరించడం, సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించడం, సేవాలాల్ భవన్, కొమరం భీమ్ భవన్ల నిర్మాణం వంటి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు.
కేంద్రంలో పన్నెండేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ గిరిజనుల కోసం చేసిన ఒక్క గొప్ప పని చెప్పాలని సవాల్ విసిరారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ హామీని నెరవేర్చకుండా గిరిజన సంక్షేమం గురించి మాట్లాడటం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు గిరిజనులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని, ఎన్నికల సమయంలో ప్రేమ చూపించి తర్వాత పూర్తిగా విస్మరిస్తున్నాయని మండిపడ్డారు.






