1 August, 2026 | 2:58 AM

సినిమాపై ఇష్టం కలగడానికి అలాంటి క్షణాలే కారణం!

01-08-2026 02:06 AM

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఆగస్టు 26న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ తదితర భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. మేకర్స్.. కియారా అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో కియారా గ్లామర్‌కే పరిమితం కాకుండా, ఆమె పోషిస్తున్న ‘నాదియా’ పాత్రలో కాన్ఫిడెన్స్, మిస్టరీ దాగి ఉన్నట్టు ఈ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. అయితే, గతంలో ఈ సినిమాలోని ‘తబాహీ’ పాట, పోస్టర్‌తోపాటు కియారా పాత్రపై కొన్ని విమర్శలు వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో దీనిపై పెద్ద చర్చ జరగటంతో ఈ విమర్శలను ఆమె కొట్టిపారేసింది.

ఇదిలావుంటే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా.. అసలు ఆ పాత్రను ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో వివరించింది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ చెప్పిన కథ తనపై ప్రభావం చూపిందని తెలిపింది. “కథ విన్నప్పుడు నా పాత్రను తీర్చిదిద్దిన విధానం చూసి ఆశ్చర్యపోయా. ఒక నటిగా నేను కోరుకునే అన్ని కోణాలూ ఆ పాత్రలో ఉన్నాయి. ఒకే పాత్రలో బలం, బలహీనత, పిచ్చి, సున్నితత్వం.. ఇలా అన్ని భావాలను పలికించే అవకాశం దక్కింది. ఇలాంటి పాత్ర చేయడం ప్రతి నటికీ ఓ కల.

నా కెరీర్‌లో ఇలాంటి క్లిష్టమైన పాత్రను పోషించగలననే ధైర్యం కలిగింది. అందుకే ఈ పాత్రని వెంటనే ఎంచుకున్నా. మహిళలను ఒకే తరహా పాత్రల్లో బంధించి చూపించడం నాకిష్టం ఉండదు. ఈ సినిమాలో నాతోపాటు నయనతార, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటివారు నటిస్తున్నారు. వీరందరితో కలిసి పనిచేయడం సరికొత్త అనుభూతినిచ్చింది. సెట్లో ప్రతి ఒక్కరూ తమ పరిమితులను దాటి కష్టపడ్డారు. అందరూ తమదైన ప్రత్యేకతను చాటుకున్నారు. సినిమాపై నాకు ఇష్టం కలగడానికి ఇలాంటి క్షణాలే కారణం. ఇంతమంది అద్భుతమైన మహిళలు ఒకే సినిమాలో కనిపించడం ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది” అని పేర్కొంది కియారా.