2 April, 2026 | 2:07 AM

నయా జాతీయ రహదారి

02-04-2026 12:00 AM
  1. భద్రాద్రి జిల్లాకు కొత్త నాలుగు లైన్ల నేషనల్ హైవే

కొత్తగూడెం, ఇల్లందు,  మహబూబాబాద్, తొర్రూరు, గౌరవెల్లి 

ఎన్‌హెచ్ 930 పి భూసేకరణకు గెజిట్ విడుదల

భద్రాద్రి జిల్లాకు రెండో జాతీయ రహదారి

కొత్తగూడెం - హైదరాబాద్ మధ్య 40 కిలో మీటర్ల ప్రయాణం ఆదా

ఇల్లెందు, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): హైదరాబాద్- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మధ్య ప్రయాణ దూరాన్ని గణనీయంగా తగ్గించే జాతీయ రహదారి (930P) నిర్మాణ పనుల్లో కీలక ముందడుగు పడింది. ఇల్లెందు నుండి కొత్తగూడెం మధ్య భూసేకరణకు సంబంధించి కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు 4.85 హెక్టార్ల భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో.. జిల్లా గుండా వెళ్లే రెండో జాతీయ రహదారికి మార్గం సుగమమైంది.

తాజా నోటిఫికేషన్ ప్రకారం.. మూడు మండలాల పరిధిలోని నాలుగు గ్రామాల మీదుగా భూములను సేకరించనున్నారు. ఇల్లెందు మండలం సుదిమళ్ల పంచాయతీ పరిధిలోని 13 సర్వే నంబర్ల స్థలాలు, టేకులపల్లి మండలం బేతంపూడి, గొల్లపల్లి పంచాయతీ పరిధిలోని 10 వేర్వేరు సర్వే నంబర్లు, లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ పంచాయతీలోని 30 సర్వే నంబర్లలోని భూములు.

నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం మార్కెట్ విలువ ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించనున్నారు. ప్రస్తుతం కొత్తగూడెం నుండి హైదరాబాద్ వెళ్లాలంటే ఖమ్మం, సూర్యాపేట మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ఎన్ హెచ్ 930పిని ప్రతిపాదించింది. ఈ రహదారి కొత్తగూడెం ఇల్లెందు క్రాస్రోడ్డు వద్ద ప్రారంభమై ఇల్లెందు, మహబూబాబాద్, తొర్రూరు మీదుగా హైదరాబాద్లోని గౌరెల్లి జంక్షన్ వరకు సాగుతుంది.

ప్రస్తుతం ఇల్లెందు - కొత్తగూడెం మధ్య ఉన్న రెండు వరుసల రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఈ పనులు పూర్తయితే హైదరాబాద్ - కొత్తగూడెం మధ్య దూరం సుమారు 40 కిలోమీటర్లు తగ్గనుంది. ఈ కొత్త జాతీయ రహదారి అందుబాటులోకి వస్తే భద్రాద్రి జిల్లా రూపురేఖలు మారిపోనున్నాయి. పారిశ్రామిక కేంద్రమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇది వెన్నెముకగా మారుతుంది.

యంత్రాల రవాణా, ఉత్పత్తుల తరలింపు సులభతరమై కొత్త పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుండి భద్రాచలం వెళ్లే భక్తులకు ప్రయాణ సమయం తగ్గుతుంది. ఖమ్మం వెళ్లాల్సిన అవసరం లేకుండా మహబూబాబాద్, కొత్తగూడెం మీదుగా నేరుగా భద్రాచలం చేరుకోవచ్చు. ప్రస్తుతం ప్రమాదాలకు నిలయంగా మారిన ఇల్లెందు-కొత్తగూడెం రహదారి విస్తరణతో ప్రయాణం సురక్షితం కానుంది.

అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లే రోగులకు ఈ రోడ్డు వరప్రదాయిని కానుంది. ఇప్పటికే మహబూబాబాద్ నుంచి నెహ్రూనగర్ వరకు పనులకు శ్రీకారం చుట్టారు. విస్తరణకోసం రహదారి ఇరుపక్కల చెట్లను తొలగిస్తున్నారు.

బయ్యారం సమీపంలో పనుల కోసం థార్ మీక్షింగ్ యూనిట్ను కూడా ఏర్పాటు చేశారు. నెహ్రూనగర్ నుంచి కొత్తగూడెం వరకు భూసేకరణ పూర్తి కావడంతో భూములు కోల్పోయే నిర్వాసితులకు కొందరికి పరిహారాన్ని కూడా చెల్లించినట్లు సమాచారం.