17 June, 2026 | 4:51 AM

నెతాన్యాహు మరింత బాధ్యతగా ఉండాలి

17-06-2026 01:28 AM

అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది

ఒప్పంద  నియమాలను ఇజ్రాయెల్ గౌరవించాలి

హెజ్బుల్లాను అణచివేసే బాధ్యతను సిరియాకే  వదిలేద్దాం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

ఒప్పంద సమయంలో ఇరాన్ దాడులపై అసంతృప్తి

వాషింగ్టన్, జూన్ 16(విజయక్రాంతి): లెబనాన్ వ్యవహారంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజెమిన్ నెతాన్యాహు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ స్పష్టం చేశారు. జీ7 సదస్సు సందర్భంగా ఆయన ఇజ్రాయెల్ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ దేశంతో అత్యంత కీలకమైన అవగాహనా ఒప్పందం ఖరారు కావడానికి కేవలం రెండు గంటల ముందే ఇజ్రాయెల్ సైన్యం బీకర దాడి చేసిందని, ఆ దాడి తనకు ఏమాత్రం నచ్చలేదని ట్రంప్ వెల్లడించారు.

సరిహద్దుల్లో ఇజ్రాయెల్ మరింత నిగ్రహాన్ని ప్రదర్శించక తప్పదని ఆయన హితవు పలికారు. ఇజ్రాయెల్ చాలాకాలంగా హెజ్బుల్లాతో పోరాడుతోందని.. ఈ క్రమంలో అక్కడ చాలా మంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. హెజ్బుల్లా ముప్పును అణచివేసే బాధ్యతను సిరియా దేశానికే వదిలేయాలని, ఈ విషయాన్ని ఇప్పటికే ఇజ్రాయెల్‌కు సూచించినట్లు ట్రంప్ గుర్తు చేశారు. ఇజ్రాయెల్ దేశ రక్షణలో వాషింగ్టన్ కీలక పాత్ర పోషిస్తుందన్న విషయాన్ని నెతాన్యాహు గ్రహించాలన్నారు.

అమెరికా అండగా నిలబడకపోతే అసలు ఇజ్రాయెల్  మనుగడలో ఉండేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తాను అధ్యక్షుడిగా లేకపోతే ఇజ్రాయెల్ ఉనికి సాధ్యమయ్యేది కాదని  స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ దేశ ప్రయోజనాల కోసం తాను చేసిన రక్షణ పరమైన పనులను చేయడానికి గతంలో ఏ ఇతర అమెరికా అధ్యక్షుడు కూడా ముందుకు రాలేదని ఆయన గుర్తు చేశారు. 

ఒప్పందాన్ని త్వరలో అధికారికంగా వెల్లడిస్తాం

ఇరాన్ దేశంతో అమెరికాకు కుదిరిన ప్రాథమిక అవగాహన ఒప్పందం ఇప్పుడు పూర్తిగా పూర్తయిందని ట్రంప్ ప్రకటించారు. ఈ చారిత్రాత్మక ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తానని ఆయన చెప్పారు. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. ఇరాన్ ఇకపై అణ్వా యుధాలు కలిగి ఉండదని.. అందుకు ఇరాన్ అంగీకరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.

ఈ ఒప్పందం ఇరాన్ అణు ఆయుధాన్ని తయారు చేయకుండా అడ్డుకునే ఒక బలమైన గోడ లాంటిదని ట్రంప్ అభివర్ణించారు. గతంలో ఒబామా హయాంలో కుదిరిన ఒప్పందం అణు ఆయుధాల తయారీకి రహదారిలా ఉంటే.. తమ ఒప్పందం దానికి పూర్తి అడ్డుకట్ట వేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఇరాన్ ఒప్పంద నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ దేశం పూర్తిగా నాశనమవుతుందని హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ కు అమెరికా 300 మిలియన్ డాలర్లు చెల్లించనుందన్న వార్తలను ట్రంప్ ఖండించారు. రాబోయే రోజుల్లో రెండవ దశ చర్చలు మరింత వేగంగా సాగుతాయని ఆయన స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో శాంతి చర్చల మధ్యవర్తిత్వ ప్రయత్నాలలో ఖతార్ దేశం పోషించిన పాత్రను ఆయన ప్రశంసించారు.