20 June, 2026 | 2:55 AM

ఓట్లప్పుడు గుర్తొస్తాం.. సమస్యలొస్తే పట్టించుకోరా?

20-06-2026 12:16 AM

శంకర్‌పల్లి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం

బురదమయంగా లక్ష్మీనిలయం కాలనీ రోడ్డు

శంకర్‌పల్లి, జూన్ 18 (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులకు, గెలిచాక తాము పడుతున్న నరకయాతన కనిపించడం లేదా అని శంకర్ పల్లి మున్సిపాలిటీ 1వ వార్డు పరిధిలోని లక్ష్మీ నిలయం కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికే కాలనీ రోడ్డంతా పూర్తిగా బురదమయంగా మారి, కనీసం నడవలేని స్థితిలో దుర్భర జీవితాన్ని గడుపుతున్నామని ఆవేదన చెందుతున్నారు.

సమస్యల వలయంలో కాలనీ:

రోడ్డు మొత్తం బురదగా మారడంతో ద్విచక్ర వాహనదారులుజారిపడుతున్నారు. కాలినడకన వెళ్లేవారు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుతో పాటు కాలనీలో మంచినీటి వసతి, అండర్ డ్రైనేజీ, వీధిదీపాల సమస్యలు వేధిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, లక్ష్మీ నిలయం కాలనీ సమస్యలను పరిష్కరించి తమ గోడును ఆలకించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఐదేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోలేదు

‘లక్ష్మి నిలయం కాలనీ రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించి, మరమ్మతులు చేపట్టాలి. గత ఐదు సంవత్సరాలుగా మున్సిపల్ పాలకవర్గానికి, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యంగా మారిం ది. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి.     

చాకలి మల్లేశం, కాలనీవాసి.