4 May, 2026 | 5:15 AM

ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష

04-05-2026 02:35 AM

సంగారెడ్డి, మే 3 (విజయక్రాంతి):సంగారెడ్డి జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ (యూజీ)2026 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష నిర్వహణను పర్యవేక్షించేందుకు అడిషనల్ కలెక్టర్ పాండు పలు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తార డిగ్రీ కళాశాల, ఇస్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇస్నాపూర్ టీఎస్‌ఎస్డబ్ల్యూఆర్‌ఎస్ పాఠశాల, అలాగే ఎద్దు మైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోని కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.

కేంద్రాలలో అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, పరీక్ష నిర్వహణ విధానం తదితర అంశాలను ఆయన సమీక్షించారు. పరీక్ష సజావుగా, నిబంధనల ప్రకారం జరుగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో మొత్తం 2,772 మంది అభ్యర్థులకు గాను 2,704 మంది పరీక్షకు హాజరైనట్లు, 68 మంది గైరాజరైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేశాయి. అడిషనల్ కలెక్టర్ వెంట జిల్లా కోఆర్డినేటర్ భారతీదేవి ఉన్నారు.

465 పరీక్షలకు హాజరు...14 మంది గైర్హాజరు

మెదక్, మే 3 (విజయ క్రాంతి) :జిల్లాలో నిర్వహించిన నీట్ పరీక్ష ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో జరిగిందని అదనపు కలెక్టర్ నగేష్ , మెదక్ ఆర్డీవో రమాదేవి తెలిపారు. ఆదివారం జిల్లాలో నీట్ పరీక్ష జరుగుతున్న మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, నీట్ పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. బయోమెట్రిక్ వినియోగించిన విధానాన్ని పరిశీలించి...అలాగే పరీక్షలకు ఎంతమంది విద్యార్థులు హాజరు అయ్యారు ,గైర్హాజరు శాతం వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు.

ఈ పరీక్షకు మొత్తం 479 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 465 హాజరయ్యారని, 14 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. పరీక్షలు పూర్తి అయ్యేంతవరకు విద్యార్థులకు ఎటువంటి అంతరాయం, సమస్యలు ఉత్పన్నం కలుగకుండా ఇన్విజిలేటర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్ష పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇతరులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతించకూడదని స్పష్టం చేశారు. మెదక్ ఆర్డీవో రమాదేవి నీట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. ఆర్డీవో వెంట తహసిల్దార్ లక్ష్మణ్ బాబు నీట్ పరీక్ష కేంద్ర నిర్వాహకులు  ఇతర పోలీసు అధికారులు, నీట్ , ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.