నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
‘లెర్న్ స్మార్ట్ విత్ ఏఐ’ను ప్రారంభించిన కలెక్టర్
తలమడుగు, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత విద్యాబోధన చేయడం జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం తలమడుగు మండలం భరంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ సహకారంతో ధ్యేయ లెర్నింగ్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘లెర్న్ స్మార్ట్ విత్ ఏఐ’ కార్యక్రమాన్ని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్‌తో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అంతకుముందు ‘లెర్న్ స్మార్ట్ విత్ ఏఐ’ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించి, కంప్యూటర్ ఏఐ ల్యాబ్‌ను కలెక్టర్, పీవో ప్రారంభించి, ఏఈ బోధన తీరును పర్యవేక్షించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 8వ తరగతి విద్యార్థుల కోసం ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో హైబ్రిడ్ లెర్నింగ్ మోడల్ను అమలు చేస్తున్నామని, తొలి విడతగా ఐటీడీఏ పరిధిలోని 2 పాఠశాలలు, విద్యాశాఖ పరిధిలోని 8 పాఠశాలలు కలిపి మొత్తం 10 పాఠశాలల్లోని 600 మంది విద్యార్థులకు ఈ శిక్షణ అందించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో దేయా సంస్థ సీఈవో ప్రణవి, తహసీల్దార్ రాజ్ మోహన్, ఎంపిడిఓ శంకర్, సర్పంచ్ దేవన్న, అధికారులు పాల్గొన్నారు.




