26 February, 2026 | 2:35 PM

చోరీ కేసును ఛేదించిన పోలీసులు

26-02-2026 12:00 AM
  1. వృద్ధ దంపతుల ఇంట్లో నగలు దొంగిలించిన పనిమనిషి అరెస్ట్
  2.   95.4 గ్రాముల బంగారం స్వాధీనం
  3. వివరాలు వెల్లడించిన ఓయూ ఇన్‌స్పెక్టర్ ఎం.మహేష్

సికింద్రాబాద్, ఫిబ్రవరి25 (విజయ క్రాంతి): వృద్ధ దంపతులకు కేర్ టేకర్గా ఉంటూ, వారి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని భారీ చోరీకి పాల్పడిన మహిళను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఓయూ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఓయూ డివిజన్ ఏసీపీ జి.జగన్, ఓయూ ఇన్స్పెక్టర్ ఎం.మహేష్, సబ్ ఇన్స్పెక్టర్ పి.కరుణాకర్ లతో కలిసి మాట్లాడుతూ హబ్సిగూడ, గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ పి.ఎల్.కె.ఎమ్. రావు (79) వయసు పైబడిన కారణం చేత వీరు తమను చూసుకోవడానికి ఒక సహాయకురాలిని నియమిం చుకున్నారు.

బుధవారం ఉదయం హబ్సిగూడ బస్ స్టాప్ వద్ద నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించడంతో దొంగిలించిన సొత్తును నిందితురాలి నుంచి సుమారు రూ. 3,88,000/ విలువైన 95.4 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.8,000/- నగదును పోలీసులు స్వాధీ నం చేసుకున్నట్టు ఏసిపి జగన్ తెలియజేశారు.

నిందితురాలి వివరాలు అల్లం తేజస్వి (43), భర్త సుదర్శన్, నివాసం మాల్రెడ్డి నగర్, ఆల్మాస్ గూడ, బడంగ్ పేట (సొంత గ్రామం: నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం, కొండనాగుల, నిందితురాలు గతంలో కిరాణా షాపు నిర్వహించి నష్టపోవడంతో భారీగా అప్పులపాలైంది. ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి దొంగతనం చేయాలని నిర్ణయించుకుంది.

జూన్ 2025లో సునీత అనే మహిళ ద్వారా హబ్సిగూడలోని డాక్టర్ రావు ఇంట్లో నెలకు రూ. 18,000/- జీతానికి కేర్టేకర్గా చేరింది. దంపతుల నమ్మకాన్ని సంపాదించిన ఆమె, అక్టోబర్ 2025 నుండి ఫిబ్రవరి 23, 2026 మధ్య కాలంలో ఇంట్లో బెడ్రూమ్ శుభ్రం చేసే నెపంతో అలమరలో ఉన్న బంగారు గొలుసులు, గాజులు, ఉంగరాలు, చంద్రహారాన్ని విడతల వారీగా దొంగిలించింది ఏసిపి జగన్ తెలియజేశారు.

నిందితురాలిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ టీం హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, విజయ్ కుమార్, వెంకటేష్, మహిళా కానిస్టేబుళ్లు ప్రియాంక,చెరుపల్లి ప్రియాంక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.